Manchu Family Issue : హైదరాబాదు, జల్పల్లిలోని తన ఇంటి వద్ద మోహన్ బాబు (Manchu Mohan Babu) మీడియా ప్రతినిధిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి జరిగిన నాటకీయ పరిణామాల మధ్య మనోజ్ (Manchu Monoj)తో పాటు జర్నలిస్ట్ పై దాడి అనంతరం మోహన్ బాబు, మంచు విష్ణు (Manchu Vishnu)ను పోలీసులు అక్కడి నుంచి బయటకు పంపేశారు. అయితే ఈరోజు ఉదయం విచారణకు హాజరు కావాలంటూ రాచకొండ సిపి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంచు విష్ణు పోలీసులకు నుంచి తమకు అందిన నోటీసులపై స్పందించారు.
మోహన్ బాబు (Manchu Mohan Babu) తలకు గాయమైంది అంటూ నిన్న రాత్రి గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మోహన్ బాబు హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేశారు వైద్యులు. మోహన్ బాబు ఆరోగ్యం స్థిమితంగా లేదని, మానసికంగా బాధపడుతున్నారని, అసలేం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా ఆయన ఎడమ కంటి కింద గాయం అయిందని, కుడి వైపు కంటి కింద వాపు ఉందని, సిటీ స్కాన్ చేయబోతున్నామని వివరించారు కాంటినెంటల్ వైద్యులు.
ఇక ఆ తర్వాత మంచు విష్ణు (Manchu Vishnu) మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగిన ఘటనపై స్పందించారు. “కలిసి మెలిసి ఉంటాం అనుకున్నప్పటికీ ఇలా జరిగింది. మేము పబ్లిక్ ఫిగర్స్, మా న్యూస్ ను మీరు పబ్లిక్ లోకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారు. కానీ కొంతమంది లిమిట్స్ క్రాస్ అవుతున్నారు. షూటింగ్లో ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టుగా నాకు ఫోన్ వచ్చింది. అందుకే అన్ని వదిలేసి వచ్చేసా. నిన్న రాత్రి జరిగిన గొడవలో టీవీ రిపోర్టర్ కు గాయాలు అవ్వడం అనేది కావాలని చేసింది కాదు. మనోజ్ గేటు పగలగొట్టుకొని ముందుకు రావడం వల్ల ఆయన అలా రియాక్ట్ అయ్యారు. విజువల్స్ ని సరిగ్గా గమనిస్తే ముందు నమస్కారం పెడుతూ ముందుకు వచ్చారు ఆయన. కానీ ఆ హీట్ మూమెంట్ లో అలా జరిగింది” అంటూ తన తండ్రి తప్పేం లేదన్నట్టుగా మాట్లాడారు.
అయితే అందులో భాగంగానే తమకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన నోటీసుల గురించి కూడా మాట్లాడారు విష్ణు (Manchu Vishnu). “లా ప్రకారం నాకు వచ్చిన నోటీసులకు నేను రెస్పాండ్ అవ్వాల్సిన పనిలేదు. 9:30 కి నోటీసులు ఇచ్చి 10:30 కి విచారణకు రావాలి అంటే ఎలా వస్తారు?” అంటూ తిరిగి ప్రశ్నించారు మంచు విష్ణు. మరోవైపు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని, ఇంతకుముందే సెక్యూరిటీ కోరినప్పటికీ… పోలీసులు తనకు భద్రతను కల్పించలేదని అందులో పేర్కొన్నారు. వెంటనే తనకు భద్రత కల్పించాలంటూ ఆ పిటిషన్ లో మోహన్ బాబు కోరినట్టుగా తెలుస్తోంది. మోహన్ బాబు తరపున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీమోహన్ ఈ పిటిషన్ ను దాఖలు చేయగా, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ పిటిషన్ ను హైకోర్టులో విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది.