Pending Challans Discount: ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ఉంటుందా అన్న సందేహం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారుల్లో పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న చలాన్లు ఎంతమేరకు తగ్గుతాయో, ఎప్పటినుంచి ఈ రాయితీ అమల్లోకి వస్తుందో అనే అనుమానాలు ఎక్కువయ్యాయి. గతంలో ప్రభుత్వం పలు సందర్భాల్లో పెండింగ్ చలాన్లపై రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 2023, 2024 సంవత్సరాల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, ట్రక్కులు ఇలా వాహన రకాల వారీగా వేర్వేరు శాతం రాయితీ ప్రకటించడంతో చాలా మంది చలాన్లు క్లియర్ చేసుకున్నారు. ఆ సమయంలో పెద్దఎత్తున వాహనదారులు క్యూల్లో నిలబడి పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకున్న దృశ్యాలు మనకు గుర్తుకు వస్తాయి.
2025 రాయితీ ఎప్పుడు?
ఇక 2025 సెప్టెంబర్ నాటికి మళ్లీ ఇదే రాయితీ వస్తుందా అనే ప్రశ్నతో వాహనదారులు ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం తరచూ వార్తలు, వదంతులు వస్తూనే ఉన్నాయి. రాయితీ ప్రకటించారట, ఇంత శాతం మినహాయింపు ఇస్తారట అంటూ సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాస్తవానికి, ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం లేదా ట్రాఫిక్ పోలీసుల నుంచి అధికారికంగా ఏ రకమైన రాయితీ ప్రకటించ లేదు. ఈ ఫేక్ వార్తలపై పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ మెసేజ్‌లను నమ్మొద్దని సూచించారు. చలాన్ల రాయితీని అధికారకంగా ప్రకటిస్తామని వెల్లడించారు. వాహనదారులు ఎటువంటి ఫేక్ వార్తలను నమ్మకుండా ప్రభుత్వం, పోలీసుల నుంచి ప్రకటన వచ్చేంత వరకు ఎదురు చూడాలని అన్నారు. ఇలాంటి వార్తలపై లింక్స్ ఏమైనా వచ్చినా నమ్మొద్దని సూచించారు.
Also Read: Deepika Padukone: హమ్మయ్య ఎట్టకేలకు స్పందించిన దీపిక.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?
లోక్ అదాలత్ నిరాశే
అయితే మరో వైపు లోక్ అదాలత్ వంటి వేదికల్లో పెండింగ్ చలాన్లపై తగ్గింపులు లేదా మాఫీలు జరిగే అవకాశం ఉందని సమాచారం వెలువడింది. సెప్టెంబర్ 13న జరగిన లోక్ అదాలత్‌లో చలాన్ల విషయంలో కొంత ఉపశమనం ఇచ్చినా, సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనలకు మాత్రమే ఈ రకమైన సడలింపులు ఉంది. కానీ ప్రమాదాలకు, మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన కేసులకు, హెల్మెట్ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం జరిగిన సందర్భాలకు మాత్రం రాయితీ వర్తించలేదు. దీంతో వాహనదారులకు నిరాశే ఎదురైందని చెప్పాలి.
స్పష్టమైన ప్రకటన ఎప్పుడు వస్తుందా?
ప్రస్తుతం వాహనదారులు కోరుకుంటున్నది ఒకటే, ప్రభుత్వం లేదా ట్రాఫిక్ శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన. పెండింగ్ చలాన్లపై రాయితీ ఉంటే ఎన్ని శాతం, ఎవరికి వర్తిస్తుంది, ఎప్పటినుంచి ప్రారంభమవుతుంది అనే వివరాలు అధికారికంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ స్పష్టత వచ్చే వరకు వాహనదారులు ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్, ప్రభుత్వ ప్రకటనలను మాత్రమే ఫాలో అవ్వడం వాహనదారులకు మేలు.