Online Transfers: స్వేచ్ఛ బ్యూరో: రవాణాశాఖలో ఎలాంటి పైరవీలకు తావుఇవ్వకుండా ట్రాన్స్ఫరెన్స్ గా ట్రాన్స్ఫర్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బదిలీలు అంటేనే పైరవీలు, పైసల కట్టలు అనే అపవాదును చెరిపేస్తూ ప్రభుత్వం ఈసారి పారదర్శక విధానానికి తెరలేపింది. శాఖ అధికారుల జోక్యం లేకుండా.. పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ విధానంలో బదిలీల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామం రవాణా శాఖ ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తోంది.
రాష్ట్రంలో రవాణాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులబదిలీలకు అవకాశం కల్పించింది. దీంతో రెండేళ్లు పూర్తి చేసుకున్నవారు బదిలీకి దరఖాస్తు చేసుకోవాలని 5 ఆప్షన్లు సైతం ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో మల్టీజోన్ 1, 2 పరిధిలో పనిచేస్తున్నవారు ఆప్షన్లు ఇస్తున్నారు. ఎంవీఐలు మల్టీజోన్-1 కింద 53 మంది, మల్టీజోన్-2 కింద 73 మంది ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు(ఏఓ)లు జనరల్ ట్రాన్స్ ఫార్స్ జోన్ 1 నుంచి జోన్ 6లలో 40మంది పనిచేస్తున్నారు. వారు సైతం ఆప్షన్లు ఇస్తున్నారు. అదే విధంగా ఏఎంవీఐలు మల్టీజోన్-1 పరిధిలో 94 మంది, మల్టీజోన్-2 పరిధిలో 97 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 2 ఏళ్లు సర్వీసు కంప్లీట్ చేసుకున్నవారు ఆప్షన్స్ దరఖాస్తులు ఇస్తున్నట్లు సమాచారం.
రవాణాశాఖలో 2024 ఫిబ్రవరిలో ఎంవీఐ, ఏఎంవీఐల బదిలీలను చేపట్టింది. అప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వీసు ఉన్నవారు 90శాతం వరకు బదిలీ అయ్యారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం జనవరి2026 వరకు రెండేళ్లు కంప్లీట్ అయినవారికి బదిలీలకు అవకాశం అని జీవో ఇచ్చింది. అయితే జీవో 38 ప్రకారం ట్రాన్స్ ఫర్ కామన్ జీవో అని, మళ్లీ జీవో 39 జీవో 21-4-2026 జనరల్ అని ఇచ్చారు. అయితే దీని ప్రకారం మూడేళ్లు సర్వీసు కంప్లీట్ అయి ఉండాలి. రవాణాశాఖ 12-6-2007 లో జీవో 147 ప్రకారం..డిపార్టుమెంట్ ప్రకారం రెండేళ్ల సర్వీసు ఉంటే ట్రాన్స్ఫర్స్ చేసే అవకాశం కల్పించింది. ఇదెలా ఉంటే గత నెలలో ఇచ్చిన జీవో ప్రకారం 10 నుంచి 15 మంది ఉద్యోగులు మాత్రమే బదిలీలకు అవకాశం ఉండటంతో చాలా మంది ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. తిరిగి జీవోను సవరించి ఈ ఏడాది ఏప్రిల్ వరకు అవకాశం కల్పించడంతో ఉద్యోగులు ఆప్షన్లు ఎంచుకుంటున్నారు.జీవో సవరణ ఊరటనిచ్చినట్లు అయింది. 90శాతం మంది ఎలిజిబుల్ అయ్యారు.
Also read: అప్పుల్లో కూరుకుపోయి ఆత్మతో ఆటలు… చేతబడితో వణికించే డెడ్లీ డెత్ ట్రాప్
గతంలో బదిలీల ప్రక్రియ రహస్యంగా, పైస్థాయి అధికారుల కనుసన్నల్లో జరిగేది. కానీ ఈసారి సీన్ మారింది. ఉద్యోగులు తమకు కావాల్సిన స్థానాలను ఆన్‌లైన్ ద్వారా ఆప్షన్ల రూపంలో ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. మొత్తం ప్రక్రియపై ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా నిఘా పెట్టినట్లు సమాచారం. ఎక్కడైనా రాజకీయ ఒత్తిళ్లు లేదా అక్రమాలు జరుగుతున్నాయేమోనని ‘డేగకన్ను’తో పర్యవేక్షించబోతున్నట్లు సమాచారం.
రవాణా శాఖ చరిత్రలో తొలిసారిగా స్టేట్ వైడ్ సీనియార్టీ లిస్టును పక్కాగా సిద్ధం చేసి బహిర్గతం చేసింది. ఎవరు ఎన్ని సంవత్సరాలు శాఖలో పనిచేస్తున్నారనే వివరాలను ప్రకటించింది. దీనివల్ల ఎవరికి ఎక్కడ పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందో ముందే ఒక స్పష్టత వస్తోంది. సీనియారిటీని కాదని ఇష్టారాజ్యంగా బదిలీలు చేసే పద్ధతికి ఈసారి స్వస్తి పలికారు. దీంతో కష్టపడి పనిచేసే అధికారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ప్రతి బదిలీల సీజన్‌లో సచివాలయం చుట్టూ, మంత్రుల నివాసాల చుట్టూ తిరిగే పైరవీకారులకు ఈసారి ‘రెడ్ సిగ్నల్’ పడింది. “సిఫార్సులు తెస్తే ఉన్న పోస్టింగ్ ఊడుతుంది” అనే గట్టి హెచ్చరికలు వెళ్లడంతో మధ్యవర్తులు సైలెంట్ అయినట్లు సమాచారం. గత బదిలీల్లో కూడా కొంతమంది చక్రం తిప్పారనే విమర్శలు వచ్చాయి. దీంతో కొంతమంది ఉద్యోగులు సైతం నిరాశకు గురయ్యాయి. వాటన్నింటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. శాఖమంత్రి సైతం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఎలాంటి పైరవీలకు తావులేకుండా బదిలీలు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం. పారదర్శకతే ప్రాతిపదికగా బదిలీలు జరుగుతుండటంతో కిందిస్థాయి సిబ్బందిలో ధీమా పెరిగింది.
Also read: కాంగ్రెస్ కోటలో ప్రధాని చిచ్చు.. అసలు స్కెచ్ ఏంటి?
బదిలీల ప్రక్రియలో భాగంగా మల్టీజోన్-2 పరిధిలో తీవ్రమైన పోటీ నెలకున్నట్లు సమాచారం. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లోని కార్యాలయాల్లో చేరేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఆదాయం ఎక్కువగా ఉండే ప్రాంతాలు కావడంతో ఇక్కడ పోస్టింగ్ కోసం వందల సంఖ్యలో ఆప్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారికే ఈ ‘ప్రీమియం’ జిల్లాల్లో అవకాశం దక్కనుంది.
శాఖలో జనరల్ బదిలీలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏళ్లుగా ఒకే ఆఫీసులు పనిచేస్తున్న కానిస్టేబుల్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు కూడా సీనియార్టీ ప్రకారం బదిలీ కానున్నారు. ఇవి జిల్లా పరిధిలోనే బదిలీ ఉండటంతో కమిషనర్ అనుమతితో జేటీసీలు ఈ బదిలీ ప్రక్రియను చేపట్టనున్నారు. వీరికి సైతం ఆప్షన్లు ఇవ్వడంతో నిబంధనల ప్రకారం వీరి బదిలీలు సైతం జరుగనున్నాయి.ఏది ఏమైనప్పటికీ రవాణా శాఖలో బదిలీల పర్వం మిగిలిన శాఖలకు కూడా ఆదర్శంగా నిలిచేలా కనిపిస్తోంది. పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ, పైరవీలకు చెక్ పెట్టడం.. అధికారుల విచక్షణ అధికారాలకు కత్తెర వేయడం ద్వారా నిజమైన ‘ట్రాన్స్‌పరెంట్’ బదిలీలు జరుగనున్నాయి. ఉద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు అవుట్..?