Telugu States Weather Update: నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి వంటివి ఏర్ఫడి వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి… తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా నాలుగైదు రోజులుగా వానలు జోరందుకున్నాయి.
గత నెల జూన్‌లో లోటు వర్షపాతం ఉండటంతో ఆందోళనకు గురయిన తెలుగు ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. జులై మొత్తం వర్షాలుంటాయని… జూన్‌లోని లోటును కూడా తీర్చేస్థాయిలో భారీ వానలు కురుస్తాయని తెలిపింది. చెబుతున్నట్లుగానే ఈ నాలుగు రోజులుగా వర్షాలు బాగానే పడుతున్నాయి.
తెలంగాణలో ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఇవాళ శుక్రవారం నాడు మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక నిజామాబాద్. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయట. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశాలున్నాయని హెచ్చరించారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ.
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు రుతుపవనాల ప్రభావం ఆంధ్ర ప్రదేశ్‌లో నేడు అనగా శుక్రవారం నాడు జోరువానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటికే 63 మంది మృతి చెందగా.. 40 మందికి పైగా గల్లంతయ్యారు. అంతేకాదు వర్షాల కారణంగా గాయపడ్డ వారి సంఖ్య 100కు పైగా ఉన్నట్టు తెలుస్తోంది.
హిమచల్ ప్రదేశ్‌లో దంచికోడుతున్న వానాలు..
మృతుల్లో ఎక్కువ మంది మండి జిల్లాలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జిల్లాలో 17 మంది మృతి చెందారు. కంగాలో 13 మంది.. చంబాలో ఆరుగురు.. సిమ్లాలో ఐదుగురు మృతి చెందారు. ఈ వరదల కారణంగా దాదాపు 400 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు అందిన లెక్కే అని.. అసలు నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 14 బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి. ముందుజాగ్రత్తగా 500 రోడ్లను మూసేశారు. మరోవైపు బాధిత ప్రాంతాల్లో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడగా.. మరికొన్ని ప్రాంతాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వర్షాల కారణంగా చిక్కుల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌ను ఆదుకుంటామన్నారు కేంద్రహోంమంత్రి అమిత్ షా. బాధితులకు తమ వంతు సాయం చేస్తామన్నారు.
ప్రజలకు హెచ్చరిక..
వర్ష సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని సూచించింది. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉండే అవకాశాలున్నాయి కాబట్టి చేపల వేటకు వెళ్లే మత్స్య కారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: చాక్లెట్‌లో బతికున్న పురుగులు!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలవడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఇప్పటికే తొలకరి వానల సమయంలోనే కొందరు విత్తనాలు విత్తుకోగా మరికొందరు ఈ వర్షాలు జోరందుకున్నాక ఆ పని చేస్తున్నారు. కాస్త ఆలస్యమైనా వర్షాలు మొదలవడంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. ఈ వర్షాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు.