చందమామలో మచ్చలా.. ముఖంపై మొటిమలు ఇబ్బందికరంగా మారుతాయి. ఎంత అందంగా ఉన్న అమ్మాయినైనా అందవిహీనంగా చూపించే లక్షణం మొటిమలది. అవి వస్తు పోతూ ఉంటాయి. అలా మొటిమలు వచ్చే వారిలో కొన్ని రోజులకు గుంతలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మొటిమలను తగ్గించే శక్తి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎంతోమంది ఈ అజెలైక్ యాసిడ్ వాడడం ద్వారా మొటిమలు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇది మొటిమలనే కాదు, మూసుకుపోయిన రంధ్రాలను తెరవడానికి, ఎరుపుదనాన్ని తగ్గించడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాల చర్మాలకు వాడవచ్చు.
అజెలైక్ యాసిడ్ అంటే ఏమిటి
అజెలైక్ యాసిడ్ అంటే డైకార్బైక్సిక్ యాసిడ్. దీన్ని గోధుమలు, రై, బార్లీ వంటి ధాన్యాలతో తయారు చేస్తారు. ఇది మొటిమలు, హైపర్ పిగ్మెంటేషన్ వంటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. చర్మంపై బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. మంటను కూడా తగ్గిస్తుంది. మూసుకుపోయిన రంధ్రాలను తెరుస్తుంది. దీనివల్ల మొటిమలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది.
దీని ప్రత్యేకత ఏమిటి?
కొన్ని పరిశోధనల ప్రకారం అజెలైక్ ఆమ్లం మృతకణాలను తొలగిస్తుంది. చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది. మొటిమలకు కారణమయ్యే ప్రోఫియోని బ్యాక్టీరియాతో సమర్ధవంతంగా పోరాడుతుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
అజెలైక్ ఆమ్లాన్ని ఎవరైనా వినియోగించవచ్చు. సున్నితమైన చర్మం ఉన్నవారికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో కఠినమైన ఆమ్లాలు ఉండవు. బెంజాయిల్ పెరాక్సైడ్ వంటివి కనిపించవు. కాబట్టి అజెలైక్ ఆమ్లం వాడడం పూర్తిగా సురక్షితమే వైద్య పరంగా కూడా ఇది నిరూపితమైంది. గాయాలు చాలావరకు తగ్గినట్టు తేలింది.
బ్యాక్టిరియాను చంపేస్తుంది
తాజా పరిశోధన ప్రకారం మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాలు కొన్ని ఉంటాయి. వాటిని పి. ఆర్నెస్, స్టేఫిలోకాకర్స్ ఎపిడెర్మిస్ వంటివి ముఖ్యమైనవి. ఇవి ప్రోటీన్ సంశ్లేషణను చెడగొడతాయి. ఈ బాక్టీరియాలను చంపే లక్షణం అజెలైక్ ఆమ్లానికి ఉంది. అలాగే చర్మంపై వచ్చే ఎర్ర దద్దుర్లు, చర్మంపై దురదలు వంటివి కూడా చాలా వరకు తగ్గుతాయి. చర్మపు ఆకృతికి ఇది మద్దతుని ఇస్తుంది. కెరోటిన్ నిర్మాణాన్ని నిరోధిస్తుంది. అలాగే చర్మంపై అధికంగా నూనె ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. దీనివల్ల మొటిమలు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి.
అజెలైక్ ఆమ్లాన్ని బ్యూటీ ఉత్పత్తుల దుకాణాలలోనూ దొరుకుతాయి. తీవ్రంగా మొటిమలతో ఇబ్బంది పడుతున్న వారు దీన్ని వాడడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. దీన్ని పాలిచ్చే తల్లులు, గర్భిణీలు కూడా వినియోగించవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. అయితే ఇది కొంచెం ఖరీదైనదనే చెప్పాలి. బెంజాయిల్ పెరాక్సైడ్ లేదా టాపికల్ రెటినాయిడ్స్ వంటి రసాయనాలు కలిపిన ఉత్పత్తులతో పోలిస్తే అజెలైక్ ఆమ్లం పని చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి దీన్ని ఓపికగా కొన్ని వారాలపాటు వాడాల్సి వస్తుంది.