Press Club: తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మొన్న రేవంత్ విసిరిన సవాల్‌కి నేడు కేటీఆర్ ప్రెస్ క్లబ్‌కి వచ్చి సై అన్నారు. ఒక పక్క రేవంత్ ఢిల్లీలో ఉండగా.. కేటీఆర్ ప్రెస్ క్లబ్‌కి వచ్చి చర్చకు సిద్ధమా? అనడమేంటన్న ప్రశ్న వినిపిస్తోంది. అంతే కాదు అసెంబ్లీలో కాకుండా ఇక్కడ చర్చ ఎందుకు చేస్తున్నట్టు? అన్నదిపుడు చర్చనీయాంశమైంది. ప్రెస్ క్లబ్ కి వచ్చిన కేటీఆర్ చేసిన కామెంట్లేంటి? ఇందుకు కాంగ్రెస్ లీడర్ల కౌంటర్లేంటి?
ప్రెస్ క్లబ్‌కి వచ్చిన కేటీఆర్
రేవంత్ వర్సెస్ కేటీఆర్ సవాళ్ల పర్వంలో భాగంగా.. కేటీఆర్ ప్రెస్ క్లబ్‌కి వచ్చారు. 18 నెలలుగా రేవంత్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని. ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని అన్నారు కేటీఆర్. రేవంత్ సవాల్ స్వీకరించి తాము చర్చకు వచ్చినా ఆయన రాలేదని అన్నారు. ఎక్కడికెళ్లారని అడిగితే ఆయన ఢిల్లీకి వెళ్లారని.. అంటున్నారు. ఎరువుల కోసం వెళ్లినట్టుగా చెబుతున్నారని అన్నారు కేటీఆర్. రైతు బంధు అందరికీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. కొండంగల్లో ఎందరు రైతులకు రైతు బంధు పడలేదో తన దగ్గర లిస్ట్ రెడీగా ఉందన్నారు కేటీఆర్. రైతుల మరణాల లిస్ట్ కూడా తీసుకొచ్చామని చెప్పారాయన. రాష్ట్రంలో ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ఇప్పటికీ తాను మరో సవాల్ విసురుతున్నాననీ.. రేవంత్‌తో చర్చకు సిద్ధం. ప్లేస్, డేట్ మీరే డిసైడ్ చేయాలని, పిలిస్తే రేవంత్ ఇంటికైనా వస్తామన్నారు మాజీ మంత్రి కేటీఆర్.
కేసీఆర్ అవసరం లేదు, మేము చాలన్న కేటీఆర్
మాట తప్పడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటేనని, చర్చకు రమ్మని పిలిచి రాకుండా ఢిల్లీకి వెళ్లారని మండిపడ్డారు కేటీఆర్. అసెంబ్లీలో చర్చించేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చలకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని, గులాబీ దళం సరిపోతుందన్నారు. కేసీఆర్‌పై చేసిన ఆరోపణలకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారాయన. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేటీఆర్‌ను సొంత చెల్లి మాత్రమే కాదు.. పార్టీలో ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజాపాలనతో బీఆర్ఎస్ ప్రభుత్వపాలనకు పొంతన లేదని అన్నారు.
రైతులకు రుణమాఫీ, వడ్ల బోనస్ ఇచ్చింది కాంగ్రెస్- మంత్రి పొంగులేటి
అసెంబ్లీ వేదికగా సంక్షేమంపై చర్చించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ లీడర్లు పారిపోతున్నారనీ.. అవసరమైతే.. సభ పెట్టేందుకు కేసీఆర్ తో లేఖ రాయించమని సూచించారు. కేటీఆర్ సవాల్ పై మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పై తామందరి పోరాట ఫలితమే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు మంత్రి పొంగులేటి. పేదవారికి సాయం చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారాయన. ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చామనీ.. రైతుకు రుణమాఫీ, వడ్లకు బోనస్ ఇచ్చి రైతును రాజును చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని అన్నారాయన. ఇదే అంశంపై చిట్ చాట్ లో మాట్లాడిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. కేటీఆర్ ది తాను స్పందించే స్థాయి కాదని అన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడాలంటే అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు కావల్సినంత సమయం కూడా ఇచ్చామని అన్నారాయన.
21 వేల కోట్ల రుణమాఫీ, 9 రోజుల్లో 9 వేల కోట్లు వేశాం DCM భట్టి
తమతో చర్చకు సీఎం రాకుంటే పోయారు.. బాధ్యతగల మంత్రో, ఉప ముఖ్యమంత్రో వస్తారనుకున్నామని అన్నారు కేటీఆర్. మహబూబాబాద్ నియోజకవర్గంలో వంద కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో 21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. అలాగే రైతు భరోసా కోసం 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేశామని అన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రజా సమస్యలను చర్చించడానికి అసెంబ్లీ ఉండగా ప్రెస్ క్లబ్ వంటి వేదికలను ఆశ్రయించడమేంటని నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అక్కడ తమ మైక్ కట్ చేస్తారు కాబట్టే తామిక్కడికి వచ్చామంటున్నారు కేటీఆర్. మరి ఈ సవాళ్ల పర్వానికి ముగింపు ఎక్కడ? ఈ చర్చకు వేదిక ఏది కానుంది?
కేటీఆర్ ప్లాన్ మార్చారా? తరచూ వార్తల్లో నిలిచే స్కెచ్ వేశారా? రైతుల పేరిట చర్చలంటూ రచ్చ రచ్చ చేస్తున్నారా? అందుకే ఆన్ రికార్డ్ కాకుండా ఇలా రాజకీయ రగడ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ కేటీఆర్ ప్రెస్ క్లబ్ ఎపిసోడ్ పై ఇతర కాంగ్రెస్ లీడర్ల కామెంట్లు ఏంటి? ఆ వివరాలు ఎలాంటివి?
కేసీఆర్ అధికారంలో ఉంటే సెక్రటేరియట్‌కి రారు
మీ సవాలుకు స్పందించి మేము వచ్చాం. మీ నుంచి బాధ్యతగల వ్యవసాయ మంత్రిగానీ, ఉప ముఖ్యమంత్రిగానీ రావల్సింది. కానీ రాలేదని అంటారు కేటీఆర్. అయితే ఈ కామెంట్ కి కౌంటర్ వేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కేసీఆర్ అధికారంలో ఉంటే సెక్రచటేరియట్‌కి రారు, ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి రారని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీ లో చర్చ కోసం స్పీకర్‌కి లేఖ రాయించాలని సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌కు కేసీఆర్ మౌనమే అంగీకారంగా ఫామ్‌హౌస్‌లో దుప్పటి కప్పుకొని పడుకున్నారని సెటైర్లు విసిరారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను 10 ఏళ్లు మోసం చేసినందుకు, ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అయ్యినందుకు కేసీఆర్ ముక్కు నెలకి రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదంతా ఎలా ఉందంటే.. సింహం లేనపుడు వచ్చి పిల్లులు పితలాటకంలా ఉందని కామెంట్ చేశారు కాంగ్రెస్ ఎంఎల్సీ అద్దంకి దయాకర్. అంతే కాదు మీకు దమ్ముంటే మీ అయ్యను తీసుకుని అసెంబ్లీకి రావాలని.. లెక్కలు ఎక్కాలు మొత్తం నేర్పుతామని హాట్ కామెంట్ చేశారు దయాకర్.
కేటీఆర్‌కు కవిత, హరీష్ భయం పట్టుకుంది అద్దంకి
రేవంత్ ని ఎదుర్కునే దమ్ము కేసీఆర్ కి లేదంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. తెలంగాణకు ఇంతగా ద్రోహం చేసి.. ఇంకా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని.. రేవంత్ ఎక్కడ నిలదీస్తారనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అంటున్నారు. ఇది ప్రజల కోసం కాదని.. వారి ఉనికి కోసం అన్నది గుర్తించాలని అంటున్నారు. కేసీఆర్ ని ఎదుర్కునే స్థాయి రేవంత్ కి లేదని అనడం కూడా సరికాదని అంటారు. కేటీఆర్ కు కవిత, హరీష్ భయం పట్టుకుందని.. అసెంబ్లీలో నిలబడి మాట్లాడే దమ్ము బీఆర్ఎస్ లీడర్లకు లేదని అంటున్నారు. అంతే కాదు ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా, కాళేశ్వరం వంటి కేసుల ద్వారా సతమతమవుతున్నారు. అందుకే కేటీఆర్ ఫ్రస్టేషన్ వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారని.. కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు.
మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా కుర్చీ వేసి ఉండాల్సింది ఎంపీ చామల
కేటీఆర్ డ్రామా ప్రెస్ క్లబ్ లో చూశామని.. సీఎం రేవంత్ రెడ్డికి తాము కుర్చీలు వేస్తున్నామని ఒక పక్క గౌరవిస్తూనే.. మరొక పక్క నీతో చర్చలకు మా కార్యకర్తలు సరి పోతారనడమేంటో తమకు అర్ధం కావడం లేదని అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అదలా ఉంచితే మాజీ సీఎం కేసీఆర్ కి కూడా కుర్చీ వేసి ఉంటే బాగుండేదని అంటున్నారు ఎంపీ చామల. రెండు కుర్చీల మధ్య కూర్చుని పదేళ్ల పాటు చేసిన తమ పాలన గురించి మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేదని అన్నారాయన. రేవంత్ రెడ్డి బస్తాలు తీస్కుని ఢిల్లీ వెళ్ళినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ సోనియా ఇచ్చిన తెలంగాణను అప్పుల పాలు చేసిందెవరు? మీరు కాదా? అని నిలదీశారు ఎంపీ చామల. రాత్రి ఏ క్లబ్ లోనో ఒకట్రొండు వేసుకుని కేటీఆర్ ప్రెస్ క్లబ్ వచ్చారని కామెంట్ చేశారు ఎంపీ చామల.
దేశాన్ని నడిపించే ప్రభుత్వం అక్కడే.. అందుకే ఢిల్లీకి ఎంపీ చామల
ఉదయాన్నే పేపర్ చదవకుండా కేటీఆర్ ఇష్టాను సారం మాట్లాడుతున్నారనీ.. సీఎం రేవంత్ ఢిల్లీకి ఏయే అంశాలపై చర్చించడానికి వచ్చారో తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ కి వర్కింగ్ ప్రెసిడెంటా నాన్ వర్కింగ్ ప్రెసిడెంటా అర్ధం కావడం లేదని అన్నారు చామల. ప్రతి సారీ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని సీఎంని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. దేశాన్ని నడిపించే ప్రభుత్వం ఢిల్లీలో ఉంది. అందుకే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు చామల. జనాల్లో తిరగలేకే.. కేసీఆర్ సిగ్గుతో ఫామ్ హౌస్ లో పడుకున్నారనీ.. గత పదేళ్ల పాలన ఎలా జరిగిందో అందరికీ తెలుసని అన్నారు ఎంపీ చామల. స్వాంతంత్రం వచ్చాక ఇప్పటి వరకూ ఎక్కడా పూర్తి స్థాయిలో రుణ మాఫీ జరగలేదనీ.. కాంగ్రెస్ మాత్రమే ఇది చేసిందని అన్నారు ఎంపీ చామల.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లక్షకోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేసినట్టు చెప్పుకొచ్చారాయన. మీ హయాంలో నోటిఫికేషన్ తప్ప ఎక్కడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని.. తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలియడం వల్లే మిమ్మల్ని అధికారం నుంచి తొలగించారని అన్నారు ఎంపీ. పార్లమెంటు ఎన్నికల్లోనూ మీకు గుండు సున్నా వచ్చింది ఇందుకేనని కామెంట్ చేశారు ఎంపీ చామల. పదేళ్ల మీ కాలంలో చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పు తీర్చే మార్గం ఏదైనా ఉంటే అమెరికాలో చదివి.. ఇతర దేశాల్లో తిరిగిన కేటీఆర్ సలహా ఇవ్వాలని డిమాండ్ చేశారు చామల.
Also Read: కూకట్‌పల్లిలో విషాదం.. కల్తీ కల్లు తాగి 40 మంది అక్కడికక్కడే
తాము అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర మాత్రమే అయ్యిందని. ఇంకా మూడున్నరేళ్ల కాలంలో మా ప్రజా పాలన ఎలా ఉంటుందో చూపిస్తామనీ.. అన్నారు ఎంపీ చామల. ప్రగతి భవన్ లో ఉంటూ రాష్ట్ర ప్రగతి పట్టించుకోకుండా దౌర్భాగ్య పాలన చేసిన ప్రభుత్వం మీదని అన్నారాయన. కేటీఆర్ ఆఫ్టరాల్ ఒక ఎమ్మెల్యే అని. ఒక వేళ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే అది కేవలం ఆయన పార్టీకి మాత్రమే తప్ప రాష్ట్రానికి కాదని కామెంట్ చేశారు ఎంపీ చామల. అంతే కాదు.. మొదట ఒక లీడర్ గా ఎదగడం నేర్చుకోవాలని.. ఇలా అమ్మెచ్యూర్ గా బిహేవ్ చేయరాదని.. సలహా ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ. మీకు పాలనపై పట్టు లేదు. ప్రస్తుత ప్రభుత్వ పాలనపై సరైన అవగాహన లేదని.. తమ ఏడాదిన్నర పాలనను రానున్న ఎన్నికలకు ఒక రెఫరెండంగా చూస్తామని అన్నారాయన.
Story By Adinarayana, Bigtv