Hydra: హైదరాబాద్ మహానగరంలో హైడ్రా వచ్చాక నగరంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆక్రమణలకు గురైన భూములను గుర్తించి హైడ్రా ప్రభుత్వ భూములను కాపాడుతోంది. రూ.వందల కోట్ల భూములను రక్షించి అక్రమణదారుల గుండెల్లో హైడ్రా గుబులు పుట్టిస్తోంది. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓ పార్క్ స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. జిల్లాలోని అల్వాల్ మండలం మచ్చబొల్లారంలో గల శ్రీ సాయి సూర్య ఫేజ్-2 కాలనీ నివాసితులు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కబ్జా ప్రయత్నాల నుండి ఓ పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు.
సర్వే నంబరు 164లోని శ్రీ సాయి సూర్య ఫేజ్-2 లో పార్కు కోసం దాదాపు 520 గజాల స్థలాన్ని 1972లోనే వేసిన లే ఔట్‌లో కేటాయించారు. అయితే.. దశాబ్దాలుగా ఈ పార్కు అభివృద్ధిని అడ్డుకుంటూ.. స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నివాసితులు తమ ఆవేదనను తెలియజేస్తూ గురువారం సాయంత్రం హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు హైడ్రా యంత్రాంగం వెంటనే స్పందించింది. శుక్రవారం క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కూడిన హైడ్రా బృందం సమగ్ర విచారణ చేపట్టింది. విచారణలో పార్కు స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిర్ధారించారు.
విచారణ పూర్తయిన వెంటనే, తదుపరి చర్యల్లో భాగంగా శనివారం ఉదయం అధికారులు ఆ పార్కు చుట్టూ బలమైన ఫెన్సింగ్ వేశారు. దీంతో, పార్కు స్థలం పకడ్బందీగా రక్షించబడింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ విజయంతో శ్రీ సాయి సూర్య కాలనీ నివాసితులు సంబరాల్లో మునిగిపోయారు. పార్కును కబ్జాదారుల చెర నుంచి విడిపించినందుకు హైడ్రా అధికారులను అభినందించారు. ముఖ్యంగా, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రాను తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి మద్ధతుగా నినాదాలు చేస్తూ తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాల కబ్జా నివారణకు, అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఉద్దేశించిన హైడ్రా సంస్థ దూకుడుగా వ్యవహరిస్తూ, ప్రజల ఆస్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోందనడానికి ఈ సంఘటన తాజా నిదర్శనం అని చెప్పవచ్చు.