Telangana Government: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల వివరాల నమోదు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ నంబర్, సెల్ ఫోన్ వివరాలను ఆర్థిక శాఖ పోర్టల్‌లో అప్‌డేట్ చేయని ఉద్యోగుల జీతాలను నిలిపివేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులందరి వివరాలు తప్పనిసరిగా నమోదు కావాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు కలిపి మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారు. గత నెలలో జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ప్రతి ఉద్యోగి పేరు, హోదా, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలను ప్రతి నెల 10వ తేదీలోపు ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే, ఈ నెల 16వ తేదీ వరకు కూడా సగం మంది ఉద్యోగుల వివరాలు కూడా పోర్టల్‌లో నమోదు కాలేదు.
ఆర్థిక శాఖ హెచ్చరికలు జారీ..
వివరాల నమోదులో జరుగుతున్న ఆలస్యంపై ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులను తీవ్రంగా హెచ్చరించింది. ‘ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరి ఆధార్, సెల్‌ఫోన్ నంబర్లు వివరాలు ఇవ్వనివారికి ఈ నెల జీతం రాదు’ అని స్పష్టం చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే.. వివరాలు నమోదు చేయని ఉద్యోగుల జీతాల బిల్లులను నిలిపివేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ నెల 25 అర్ధరాత్రి లోపు..?
ప్రభుత్వ ఆదేశాల మేరకు వివరాలు అప్‌డేట్ చేయని ఉద్యోగులు ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి లోపు తప్పనిసరిగా ఆధార్, ఇతర వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన ఉద్యోగులు కూడా వెంటనే తమ వివరాలను నమోదు చేయాలని.. లేని పక్షంలో తమకూ ‘ఇదే ట్రీట్‌మెంట్’ అమలు అవుతుందని ఆర్థిక శాఖ హెచ్చరిక జారీ చేసింది. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంలో భాగంగా ఉద్యోగుల డేటాను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కీలక నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.