Minister Sitakka: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో లేని బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరంబండ జ్యోతినగర్ కాలనీలో ఈ రోజు జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ గెలుపు అత్యంత అవసరమని మంత్రి సీతక్క అన్నారు. అందుకే ప్రజలు హస్తం గుర్తుకే ఓటెయ్యాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గతంలో మూడుసార్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గెలిచినా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆమె ఆరోపించారు.
పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని మంత్రి సీతక్క తెలిపారు. పేదలకు ఉచితంగా బియ్యం, మహిళలకు ఉచిత రవాణా, కేవలం రూ. 500లకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆమె గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4.5 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేసిందని వివరించారు. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. ప్రతి మహిళను మహిళా సంఘాల్లో చేర్చుతున్నామని.. రూ. 27 వేల కోట్ల బ్యాంకు రుణాలను మంజూరు చేశామని తెలిపారు. మహిళా సంఘాలకు ప్రమాద బీమాతో పాటు లోన్ బీమాను కూడా కల్పిస్తున్నామని గుర్తు చేశారు.
నిరంతరం ప్రజల కోసమే పని చేసే వ్యక్తి నవీన్ యాదవ్
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ అభివృద్ధి పనులు చేపట్టలేదని తీవ్ర విమర్శలు చేశారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అయిన నవీన్‌యాదవ్ నే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు. గతంలో రెండుసార్లు ఎన్నికల్లో ఓటమి ఎదురైనా నవీన్‌యాదవ్ వెనకడుగు వేయకుండా ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే నవీన్‌యాదవ్ గెలుపు అనివార్యమని ఆమె అన్నారు. ‘ఇల్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి… కన్నీళ్లు కావాలంటే మరొకరికి ఓటెయ్యండి’ అంటూ మంత్రి సీతక్క ప్రజలకు పిలుపునిచ్చారు.
ALSO READ: Telangana Government: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆధార్ లింక్ కానీ ఉద్యోగులకు ఇక నో శాలరీ