Retatrutide Injections: ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న వెయిట్ లాస్ ఇంజక్షన్లను ఆన్ లైన్ ద్వారా అమ్ముతున్న వ్యవహారంపై టీజీ సేఫ్ అధికారులు కేసులు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాలో ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్న రెటాట్రుటైడ్ అన్న వెయిట్ లాస్ ఇంజెక్షన్ ను మన దేశంలో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తున్నట్టుగా టీజీ సేఫ్ అధికారులకు సమాచారం అందింది. ‘పెప్టిగ్రిడ్’ అన్న వెబ్ సైట్, వాట్సాప్ బిజినెస్ ఖాతా ద్వారా ఈ ఇంజెక్షన్లను ఒక్కోటి 5వేల రూపాయలకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. దీనిని నిర్ధారించుకోవడానికి అధికారులు ఆర్డర్ పెట్టగా ఆ ఇంజెక్షన్ వయల్స్ వారి కార్యాలయానికి డెలివరీ అయ్యాయి.
ఈ క్రమంలో విచారణ జరుపగా ఈ ఇంజెక్షన్లు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన శిఖర్ సింగ్ అనే వ్యక్తి ద్వారా సరఫరా అవుతున్నట్టు తేలింది. దాంతో టీజీ సేఫ్ అధికారులు శిఖర్ సింగ్ పై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940తోపాటు ఇతర సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఇంజక్షన్ల వయల్స్‌పై కేవలం పరిశోధనల కోసం మాత్రమే అని స్పష్టంగా ముద్రించి ఉన్నా సామాన్యులు స్వయంగా ఇంజెక్షన్ ఎలా చేసుకోవాలో వివరించే 12 పేజీల మాన్యువల్ ను కూడా పార్శిల్ తో పాటు పంపించటం గమనార్హం.
నిబంధనలకు విరుద్ధంగా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్‌లు, టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ద్వారా విక్రయించే ఇలాంటి అనుమతి లేని వెయిట్ లాస్ మందులను కొనుగోలు చేయవద్దని టీజీ సేఫ్ అధికారులు సూచించారు. నాణ్యత, భద్రతా ప్రమాణాలు లేని ఇలాంటి ఇంజెక్షన్లను వైద్యుల పర్యవేక్షణ లేకుండా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్లు సోకుతాయన్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ మందుల విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే టీజీ సేఫ్ టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 కు ఫిర్యాదు చేయాలని కోరారు.
Also Read: రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఒక్క రిజర్వాయర్ అయినా కట్టారా? హరీశ్‌రావు