KCR Attendant: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌస్, నివాసంలో ఎంతో నమ్మకంగా, అటెండర్‌గా పనిచేస్తున్న కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
అసలేం జరిగిందంటే..
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద ఈ ఘోరం జరిగింది. రాత్రి వేళ మణికుమార్, మరో యువకుడు భరత్ కలిసి బైక్‌పై వెళ్తుండగా.. వెంకయ్యకుంట వద్ద మృత్యువు రూపంలో దూసుకొచ్చిన ఓ ఇసుక లారీ వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మణికుమార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తీవ్రంగా గాయపడిన భరత్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, రాత్రి 2 గంటల సమయంలో చికిత్స పొందుతూ భరత్ కూడా కన్నుమూయడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చలించిపోయిన కేసీఆర్ కుటుంబం
ఈ విషయం తెలియగానే కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావుకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మణి తమ కుటుంబంలో ఒకడిగా కలిసిపోయాడని, ఆయన లేని లోటు తీరనిదని కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కేటీఆర్, శైలిమ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కేసీఆర్, దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాలని మాజీ ఎంపీ సంతోష్ కుమార్, శరత్ రావులను ఆదేశించారు.
Also Read: బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి!