Meerut Terrorist: ఆత్మాహుతి దాడులకు కుట్రలు చేస్తున్న అనుమానిత ఉగ్రవాదిని ఉత్తరప్రదేశ్ మీరట్ లో భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. ప్రాథమిక విచారణలో సదరు వ్యక్తికి పాకిస్తానీ ఉగ్రవాద హ్యాండ్లర్, గ్యాంగ్ స్టర్ అయిన షహజాద్ భట్టీతోపాటు మరికొందరితో సంబంధాలు ఉన్నట్టుగా వెల్లడైంది.
మీరట్ లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధి బనియాపడా ప్రాంతానికి చెందిన ఉజైద్ ఖురేషీ.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా బలగాలకు సమాచారం అందింది. అతడికి ఖురేషీకి పాకిస్తాన్ కు చెందిన గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాద హ్యాండ్లర్ షహజాద్ భట్టి నెట్‌వర్క్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు తేలింది. దాంతో సోమవారం రాత్రి భద్రతా బలగాలు ఖురేషీని అదుపులోకి తీసుకున్నాయి.
కాగా, జమ్మూకశ్మీర్ లోని సైనిక స్థావరాలు, ఎయిర్‌బేస్ లపై ఆత్మాహుతి (ఫిదాయీన్) దాడి చేయడానికి ఖురేషీ కుట్రలు చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అతడు చేసిన చాటింగ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్, సెషన్ యాప్ లలో ‘Tuition-40’, ‘Brigade’ వంటి గ్రూపులను నడుపుతున్న ఖురేషీ.. 14 నుంచి 18 ఏళ్ల వయసున్న యువకులను ఉగ్రవాదం వైపు అడుగులు వేయించే ప్రయత్నాలు చేసినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది
Also Read: రహస్యాల లీక్ ఎఫెక్ట్.. సైనికులకు 87 యాప్‌లు బ్యాన్.. ఇన్‌స్టా, ఎక్స్ పోస్టులపై నిషేధం!
నిజానికి గత ఏడాది నవంబర్ లో జమ్మూకశ్మీర్‌లో అరెస్టయిన అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ సాజిద్ విచారణలో ఖురేషీ పేరు బయటకు వచ్చింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని ఎట్టకేలకు మీరట్ పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు అతన్ని విచారిస్తున్నారు.
Also Read: అదంతా స్క్రిప్ట్.. తప్పుగా అర్థం చేసుకోవద్దు.. రోహిత్ నాయుడు సంచలన పోస్ట్!