Certificate Delays: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు జారీ చేయాల్సిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ గాడీన పడటం లేదు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లలో అధికారులు సర్టిఫికెట్ల జారీలో పారదర్ళకత కోసం ఒక వైపు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సివిలియన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్)ను అమలు చేస్తూనే, మరో వైపు కొన్ని సర్కిళ్లలో పాత విధానాన్నే అమలు చేస్తున్నారు. కొత్త సీఆర్ఎస్ విధానంపై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్గిన తర్వాత పాత విధానాన్ని ఎత్తి వేయాలని అధికారులు భావించగా, అదే కొందరు సర్కిల్ స్థాయి సిబ్బందికి వరంగా మారినట్లు సమాచారం.
ఇప్పటి వరకు మూడు మున్సిపల్ కార్పొరేషన్లు జారీ చేసిన బర్త్, డెత్ సర్టిపికెట్లను కూడా సీఆర్ఎస్ లోకి అప్ లోడ్ చేస్తున్న సంగతి తెల్సిందే. కానీ మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ విషయంలో సిబ్బంది, సర్కిల్ స్థాయిలో బర్త్, డెత్ లను రిజిస్ట్రేషన్ చేయాల్సిన మెడికల్ ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఫలితంగా బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు రోజుల తరబడి సర్కిల్, ప్రధాన కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. జనన, మరణాలు సంభవించిన నెల రోజుల్లోపాటు సర్టిఫికెట్లు జారీ చేయాలన్న నిబంధనలున్నా, వాటిని అధికారులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదన్న ఆరోపణలున్నాయి.
ముఖ్యంగా కొందరు తల్లి దండ్రులు తమ ఇంట్లో జరిగిన జననాలకు సంబంధించి తొలుత శిశువు లేకుండా సర్టిఫికెట్లు తీసుకుని, ఆ తర్వాత శిశువుకు నామకరణం చేసిన తర్వాత ఆ పేరుతో సర్టిఫికెట్ కావాలని దరఖాస్తు చేసుకుంటే అధికారులు చుక్కలు చూపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జననం సంభవించిన రెండు నెలల్లో శిశువు పేరుతో బర్త్ సర్టిఫికెట్ కోరే దరఖాస్తు దారులు అఫిడెవిట్ సమర్పించే అవసరం లేకపోయినా, సర్కిల్ లోని హెల్త్ సెక్షన్ అధికారులు అఫిడెవిట్ సమర్పించాలని సూచిస్తున్నట్లు పలువురు దరఖాస్తుదారులు పాపోతున్నారు. అధికారులు సూచించిన విధంగా మ్యానువెల్ గా నోటరీ అఫిడెవిట్ సమర్పిస్తే, కొద్ది రోజులకే ఆ ఫైలు కన్పించటం లేదని సమాధానం చెబుతూ అధికారులు మళ్లీ సమర్పించాలని దరఖాస్తుదారులకు సూచిస్తూ, లేనిపోని నిబంధనలు చెబుతూ ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలోని మెహిదీపట్నం సర్కిల్ లో ఇలాంటి ఘటన ఒకటి సోమవారం చోటుచేసుకుంది. ఇంతకు ముందే బర్త్ సర్టిఫికెట్ కోసం శిశువు పేరుతో దరఖాస్తుదారుడు నోటరీ అఫిడెవిట్ సమర్పించారు. సర్టిఫికెట్ సోమవారం జారీ చేస్తామని అధికారులు చెప్పిన సమాధానం మేరకు సదరు దరఖాస్తుదారుడు మెహిదీపట్నం సర్కిల్ కు వెళ్లి, సర్టిఫికెట్ కోసం వాకబు చేయగా, సర్కిల్ సిబ్బంది మీ ఫైలు మొత్తానికి కన్పించటం లేదని, తాజాగా మరో నోటరీ అఫిడెవిట్ ను సమర్పించాలని సూచించటంతో దరఖాస్తుదారుడు షాక్ కు గురయ్యారు. ఈ తర్వాత ప్రధాన కార్యాలయం అధికారులను గట్టిగా ప్రశ్నించే సరికి, ఎలాంటి నోటరీ అపిడెవిట్ సమర్పించకుండానే కేవలం గంట వ్యవధిలో సర్టిఫికెట్ జారీ చేశారు.
Also read: బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి!
నిబంధనలకు విరుద్దంగా బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ అయ్యేందుకు అసలు సూత్రధారులు సర్కిళ్లలోని హెల్త్ సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ అపరేటర్లేనన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. గతంలో 2023లో వేల సంఖ్యలో బోగస్ బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ వ్యవహారం తీవ్ర స్థాయిలో దుమారం రేపటంతో విచారణ చేపట్టిన అధికారులు సర్టిఫికెట్ల జారీల్లో అక్రమామలకు పాల్పడిన ఫలక్ నుమా, మలక్ పేట, మెహిదీట్నంలోని కొందరు కంప్యూటర్ ఆపరేటర్లను బాధ్యులుగా గుర్తించి, విధుల నుంచి తొలగించటంతో పాటు అప్పట్లో జారీ చేసిన వేల బర్త్, డెత్ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ రద్దు కూడా చేయాల్సి వచ్చింది.
కేవలం ముగ్గురు కంప్యూటర్ అపరేటర్లపైనే అధికారులు చర్యలు తీసుకోగా, జీహెచ్ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లలోని ఎక్కువ సర్కిళ్లలో సుమారు రెండు దశాబ్దాల నుంచి ఒకే కుర్చీల్లో తిష్ట వేసిన కొందరు కంప్యూటర్ ఆపరేటర్లు అడ్డదారుల్లో బర్త్, డెత్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పర్మినెంట్ తో పాటు ఔట్ సోర్స్ ప్రాతిపదికన విధులు నిర్వహించే కామాటి, అటెండర్ మొదలుకుని గెజిటెడ్ ఆఫీసర్ వరకు ప్రతి మూడు, నాలుగేళ్లకు బదిలీలు చేస్తున్నా, కంప్యూటర్ ఆపరేటర్లకు బదిలీలు ఎందుకు వర్తించవని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కంప్యూటర్ ఆపరేటర్లు అడ్డదారిలో సర్టిఫికెట్లను జారీ చేస్తూ, అక్రమార్జనకు పాల్పడుతూ, అందులో మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్ మొదలుకుని ప్రధాన కార్యాలయంలోని కొందరు అధికారులకు నెలసరి వాటాలు చెల్లిస్తున్నందున వీరికి స్థానచలనం కల్గటం లేదన్న ఆరోపణలున్నాయి.
అక్రమ మార్గల్లో సర్టిఫికెట్లు జారీ చేయటంలో సిద్దహస్తులైన కంప్యూటర్ ఆపరేటర్లు ఈ మధ్య సరి కొత్తగా రూట్ లో అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. బర్త్, డెత్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకునే వారు అన్ని రకాల పత్రాలను సమర్పిస్తూ దాఖలు చేసినా, లంచాల కోసం అఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేయించుకోవటంతో పాటు సర్టిఫికెట్ల జారీ, కరెక్షన్ విషయాల్లో రూల్స్ మాట్లాడే దరఖాస్తుదారులను చాలా డిఫరెంట్ వేలో ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు.
లంచాలు ఇవ్వలేని దరఖాస్తుదారులకు జారీ చేసే సర్టిఫికెట్లలో వ్యక్తిపేరు, లేక ఇంటి పేరును తప్పుగా ముద్రించి జారీ చేస్తున్నారు. సర్టిఫికెట్ సిద్దమైందని దరఖాస్తుదారుడి ఫోన్ కు మేసేజ్ రాగానే, అది చూసుకుని తిరిగి సర్కిల్ ఆఫీసుకు వచ్చే దరఖాస్తుదారుడికి ప్రింటింగ్ మిస్టేక్ అని చెబుతూ, బేరసారాలు కుదుర్చుకునే దందా జోరుగా జరుగుతున్నందునే చాలా సర్కిళ్ల కంప్యూటర్ ఆపరేటర్లు తమ సీటును వదులుకునేందుకు సిద్దం లేరని, బదిలీల విషయం రాగానే సర్కిల్ స్థాయి నుంచి ప్రధాన కార్యాలయం వరకు అధికారులకు వేలల్లో లంచాలు సమర్పించి, మినహాయించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read: 36 ఏళ్ల క్రితం చనిపోయిన శవం… ప్రతి పౌర్ణమికి రాక్షసుడిగా… ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్