1400 Bus Service Cancelled TGSRTC: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షారల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరికొన్నిచోట్ల భారీగా వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా టీజీఎస్ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బస్సులను రద్దు చేసింది.
ఏపీ, తెలంగాణ మధ్య రవాణకు కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల భారీ వరద ప్రవహిస్తుంది. ఈ మేరకు ఆ మార్గంలో బస్సులను రద్దు చేసింది. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ వైపుగా వెళ్లే రోడ్డన్నీ జలమయం కావడంతో ఆయా మార్గాల్లో బస్సులను పూర్తిగా రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఈ మేరకు ఆదివారం రాత్రి వరకు 877, సోమవారం ఉదయం నుంచి 570 కలిపి 1,400కు పైగా బస్సులను రద్దు చేసింది. వరద ఉధృతి తగ్గిన తర్వాత మళ్లీ బస్సులను తిరిగి యథావిధిగా నడపనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సులను గుంటూరు మీదుగా దారి మళ్లించనున్నట్లు తెలిపారు.
అయితే ఖమ్మం జిల్లాకు యథావిధిగా బస్సులను నడుపుతున్నట్లు అధికారులు వివరించారు. మరోవైపు వరద ప్రవాహంతో వికారాబాద్‌లో 212 బస్సులకు బదులు 50 మాత్రమే నడుపుతున్నట్లు రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీలత తెలిపారు. ఈ మేరకు జిల్లాల వారీగా చూస్తే.. ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ జిల్లాలో 150, రంగారెడ్డి జిల్లాలో 70కిపైగా బస్సులను రద్దు చేసింది.
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 400కు పైగా రైళ్లను రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వీటితోపాటు 70కిపైగా రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. రద్దు చేసిన రైళ్లలో సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ లు కూడా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
అలాగే, పలు ప్యాసింజర్ రైళ్లను సైతం రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాజీపేట – డోర్నకల్ – కాజీపేట, డోర్నకల్ – విజయవాడ – డోర్నకల్, విజయవాడ – గుంటూరు – విజయవాడ రైళ్లను రద్దు చేశారు. ఢిల్లీ – సెంట్రల్ చెన్నై, దానాపూర్ – బెంగళూరు రైళ్లను దారి మళ్లించారు. దీంతోపాటు రాయపురం – పటేల్ నగర్, హజ్రత్ నిజాముద్దీన్ – రేణిగుంట రైళ్లను మరో మార్గంలో నడపనున్నారు.
Also Read: తెలంగాణలో వరదలు.. మిస్సయిన తండ్రీ-కూతురు బాడీ లభ్యం..
ఇదిలా ఉండగా, తెలంగాణ నుంచి ఏపీకి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో 24 గంటలుగా వాహనదారుల పడిగాపులు కాస్తున్నారు. ఏపీలో కృష్ణమ్మ, తెలంగాణలో గోదావరి వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో మోకిలా లో విల్లాల్లోకి వరద నీరు చేరింది. దీంతో 25 కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లిపోయాయి.
అలాగే నిజామాబాద్ జిల్లా సావేల్ లో గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. నీటిలో ఆశ్రమం చిక్కుకుంది. ఈ ఆశ్రమంలో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మరిపెడ – కురవి రోడ్డు కొట్టుకుపోయింది. దాదాపు కిలోమీటర్ మేర రోడ్డు కొట్టుకుపోయింది. ఆకేరు వాగు పొంగిపొర్లడంతో రహదారి ధ్వంసమైంది. బస్సుల రద్దు కావడంతో మహబూబాబాద్ జిల్లా ప్రయాణికుల ఇక్కట్లు పడుతున్నారు.