Hyderabad Bonalu 2025: ఆషాఢమాసం వచ్చిందంటే తెలంగాణలో సంబురం మొదలౌతుంది. ఆషాఢ మేఘం ఆనందరాగమవుతుంది. తొలకరి పలకరిస్తుంది. పుడమి తల్లి పులకరిస్తుంది. ఆ పులకరింపుకు ప్రకృతి స్వరూపమైన అమ్మవారే కారణం. అందుకే తెలంగాణలో బోనాల జాతర ధూందాంగా జరుగుతుంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, డప్పు సప్పుళ్లు, డిల్లెంబల్లెం మోతలు, కళాకారులతో ఆటపాటలతో గల్లీ గల్లీ మార్మోగేందుకు అంతా సిద్ధమైంది.
బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమవుతుంది. మరో మూడు రోజుల్లోనే బోనాల పండగ సందడి మొదలు కానుంది. నెల రోజుల పాటు డప్పు చప్పుళ్లు, పోతురాజుల ఆటలతో కోలాహలంగా మారనుంది. జూన్ 26న ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ నుంచి తొలి బోనం ప్రారంభం కానుంది. 28 కుల వృత్తులకు చెందినవారు ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఏడాది బోనాలకు సంబంధించిన కుండల తయారీని మోహదీపట్నంలోని కుమ్మరివాడలోని దామ కుటుంబాని ఇచ్చింది గోల్కండ ఉత్సవ సమితి. అమ్మవారికి సమర్పించే బోనం కుండల తయారీ ఏ విధంగా ఉంటుందో చూసేద్దాం…
మట్టి కుండల తయారీ అందరికి తెలుసు. కానీ బోనం తయారుచేసే మట్టి కుండలు విభిన్న సైజుల్లో ఉంటాయి. ఇందులో ప్రధాన నైవేద్యం పెట్టే కుండ ఒకటి, దానిపైన చిన్న బుడ్డి, దాని మీద దీపం పెట్టే ముంత ఉంటాయి. వీటన్నింటిని కలిపి సెట్‌గా అందిస్తుంటారు తయారీదారులు. కుండలు తయారైన తర్వాత వాటిని ఆరబెట్టి, బట్టీలలో కాలుస్తారు. ఆ తర్వాత సున్నం పూసి, రంగులను అద్దుతారు.
బోనాల పండుగకు 2 నెలల ముందే ఉత్సవ సమితి నుంచి తమకు ఆర్డర్ వచ్చిందన్నారు తయారీ దారులు దామ లత. గత మూడేళ్లుగా గోల్కొండ అమ్మవారికి మట్టికుండలను తామే తయారుచేసి అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఏడాది 516 మట్టి కుండలు కావాలని అర్డర్ ఇచ్చారని…వాటన్నింటిని సిద్ధం చేసి ఉంచామని తెలిపారు.
అమ్మవారికి సమర్పించే బోనం కుండలను ఎంతో అందంగా తయారుచేస్తున్నారు తయారీ దారులు. కుండలమీద అమ్మవారి కళ్లతో అందంగా బొమ్మలను గీసి ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్నారు. అమ్మవారికి మట్టి కుండ బోనమే సమర్పించాలని…అమ్మవారికి అదే నచ్చుతుందని తయారీ దారులు చెప్తున్నారు.
Also Read: తెలంగాణకు భారీ వర్ష సూచన.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
బోనాల పండగపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నిధులు కేటాయించని తెలిపారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు గోల్కొండలో జరిగే తొలి బోనం ఉత్సవాలలో పాల్గొనేలా చేయాలని ఆదేశించారు. గోల్కొండ బోనాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంలో పని చేయాలని సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా భక్తులు క్యూ కట్టే ప్రదేశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహాకాళి బోనాలను నిర్వహించడం జరుగుతుంది. ఆషాడ మాసం చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో పూజలు చేసి ఉత్సవాలను ముగింపు పలుకుతారు.