దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం కనిపించండం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో స్పీడ్ ట్రయల్స్, భద్రతా పరీక్షల్లో సక్సెస్ అయినప్పటికీ, తాజాగా నిర్వహించిన కీలక పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో స్లీపర్ రైలు ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) రూపొందించిన 16 కోచ్‌ల ప్రోటో టైప్ వందేభారత్ స్లీపర్ రైలును BEML రూ.120 కోట్లతో నిర్మించింది. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CRS) ఆమోదం కోసం వెయిట్ చేస్తోంది. అయితే, రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) విస్తృతమైన వేగం, బ్రేకింగ్, ఎలక్ట్రికల్ సిస్టమ్ ట్రయల్స్ ను పూర్తి చేసిన తర్వాత కూడా, CRS డిజైన్ అభ్యంతరాలను లేవనెత్తింది. ఈ నేపథ్యంలో వందేభారత్ స్లీపర్ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు.
డిజైన్ లో సమస్యలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు
రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. వందే భారత్ స్లీపర్ రేక్ అందుకున్న తర్వాత ICF 73 భద్రతా సంబంధిత డిజైన్ సమస్యలను గుర్తించింది. వీటిలో క్రాష్ బఫర్‌లు, బెర్త్ కనెక్టర్లు, అగ్ని ప్రమాద రక్షణ లక్షణాలలో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. BEML సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ, ఈ రైలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. నిజానికి CRS లేవనెత్తిన అన్ని అనుమానాలకు BEML సమాధానాలు చెప్పింది. ఆ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించింది. ప్రస్తుతం ప్రోటో టైప్ లో పెద్ద లోపాలు ఏవీ లేవని ICF జనరల్ మేనేజర్ సుబ్బారావు ధృవీకరించారు. రైల్వే బోర్డు నుంచి త్వరలోనే క్లియరెన్స్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
అడ్వాన్స్‌డ్ సేఫ్టీ టెక్, కవచ్ ఇన్‌స్టాలేషన్ పూర్తి
వందే భారత్ స్లీపర్ వెర్షన్ అప్ గ్రేడ్ చేసిన తర్వాత పూర్తి స్థాయి భద్రతా లక్షణాలతో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాద గుర్తింపు వ్యవస్థలతో పాటు, క్రాష్ వర్తీ కప్లర్లు, ముందు, వైపు క్రాష్ బఫర్‌లు, రైలు ఢీకొనకుండా ఉండే అవాయిడెన్స్ కవచ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ రైలులో 11 త్రీ-టైర్ AC కోచ్‌లు, నాలుగు టూ-టైర్ AC కోచ్‌లు, ఒక ఫస్ట్-క్లాస్ AC కోచ్ ఉన్నాయి. వీటిలో మొత్తం 823 సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో తొమ్మిది స్లీపర్ రైళ్లను ఉత్పత్తి చేయాలని ICFకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయబడ్డాయి. చివరి అనుమతి పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీనగర్ కు స్లీపర్ ప్రారంభం అవుతుందని భావించినా..
నిజానికి కత్రా-శ్రీనగర్ నడుమ దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ అందుబాటులోకి వస్తుందని అందరూ భావించారు. కానీ, ప్రధాని మోడీ కేవలం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును మాత్రమే ప్రారంభించారు. శ్రీనగర్ తో పాటు దేశ వ్యాప్తంగా ఒకేసారి 10 వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తాయ ఊహాగానాలు వినిపించాయి. కానీ, ఎందుకో వీటి ప్రారంభం గురించి రైల్వేశాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ రైల్లో డిజైన్ లోపం ఉన్నట్లు రైల్వే సేఫ్టీ అధికారులు గుర్తించారు.