Weather News: గడిచిన నెలలో భారీ వర్షాలు దంచికొట్టాయి. ఆగస్టు రెండో వారంలో మొదలైన వర్షాలు.. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ చివరి వారంలో కుండపోత వానలు పడ్డాయి. ముఖ్యంగా కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఏపీలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. భారీ వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి జిల్లాలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లు నేలమట్టం అయ్యాయి. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు కీలక అప్టేట్ ఇచ్చారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిరిగి, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇవాళ, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఇవాళ, రేపు నిర్మల్, నిజామాబాద్, కామా రెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే మెదక్ జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం దంచికొడుతుంది. రహదారులపై భారీ వరద నీరు వచ్చి చేరింది. వాహనాదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలో నిన్న రాత్రి కుండపోత వాన పడుతోంది.
కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
రాబోయే 2 గంటల్లో అబ్దుల్లాపూర్ మెట్, హిమాయత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి, బోడుప్పల్, కాప్రా, అల్వాల్, ఉప్పల్, నాగోల్, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, ఓయూ, నాచారం, మౌలాలి, ఈసీఐఎల్, నాగారం, దమ్మాయిగూడ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు.
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..
భారీ వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిన్న పలు చోట్ల పిడుగు పడి ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద నిలబడకూడదని వివరించారు.