CM Revanth Reddy: మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఎన్డీయే నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ఛలో సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు.. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. బీజేపీ నేతలు, శ్రేణుల నిరసనలకు ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా 144 సెక్షన్ ను విధించారు. అంతేకాకుండా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంటికి దారితీసే మూడు మార్గాల్లో బారీకేడ్లను సైతం పోలీసులు ఏర్పాటు చేశారు.
శుక్రవారం రాత్రి పార్లమెంటులో బిల్లు వీగిపోయిన అరగంటకే హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దిష్టిబొమ్మను సైతం తగలపెట్టారు. అనంతరం శనివారం రోజున సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు సైతం ఛలో సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటానన్న సంకేతాలు ఇవ్వడంతో ఉదయం నుంచే నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు పెద్ద ఎత్తున బారీకెడ్లను, సిబ్బందిని మోహరించారు.
సీఎం ఇంటికి వెళ్లే మూడు మార్గాలను ప్రస్తుతం పోలీసులు తమ అదుపులోకి తెచ్చుకున్నారు. ముఖ్యమైన పనుల మీద వెళ్తున్న వారు, ఆ ఏరియాలో నివసిస్తున్న వారిని మాత్రమే ప్రస్తుతానికి ఆ మార్గంలోకి పోలీసులు అనుమతిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు, రాజకీయ నేతలను ఎట్టిపరిస్థితుల్లో సీఎం ఇంటికి వెళ్లే మార్గాల్లో అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీకి చెందిన కొందరు కార్యకర్తలు బైక్స్ మీద సీఎం ఇంటి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని అడ్డుకొని పోలీసులు వెనక్కి పంపేచేశారు. మెుత్తం మీద బీజేపీ నిరసనల పిలుపు నేపథ్యంలో సీఎం రేవంత్ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉందని చెప్పవచ్చు.
Also Read: చంద్రబాబు, లోకేశ్, పెమ్మసాని గుర్తుపెట్టుకో.. ఎవరినీ వదిలిపెట్టను.. అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన చేపట్టాలని బీజేపీ నిర్ణయించిన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రామచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి నుంచి బయటకు రావడానికి వీల్లేదని ఆయనకు సూచించారు. మరోవైపు తనను గృహ నిర్భందం చేయడంపై రామ చందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించే బిల్లును అడ్డుకొని నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మరోవైపు బీజేపీకి చెందిన పలువురు నేతలను సైతం పోలీసులు హౌస్ అరెస్టు చేయడం గమనార్హం.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను లింకప్ చేస్తూ లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ (131 రాజ్యంగ సవరణ) బిల్లు వీగిపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు.. ఈ బిల్లును వ్యతిరేకించడంతో 2/3వ వంతు మెజారిటీ రాక.. బిల్లు కార్యరూపం దాల్చలేదు. ఈ బిల్లు కోసం నిర్వహించిన ఓటింగ్ లో 528 ఎంపీలు పాల్గొనగా.. అందులో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. సాధారణ మెజారిటీ లభించినప్పటికీ రాజ్యాంగపరమైన ప్రత్యేక మెజారిటీ నిబంధనను ప్రభుత్వం అందుకోలేకపోయింది. దీంతో సీట్ల పెంపు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్డీయే కూటమి.. శనివారం రోజున దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
Also Read: Meta layoffs: మెటా షాకింగ్ నిర్ణయం.. ఒక్కరోజులో 8,000 మంది ఉద్యోగుల తొలగింపు..!