
BRS : నేటితో 23వ వసంతంలోకి అడుగు పెట్టింది BRS. ఇన్నాళ్ల కారు ప్రయాణం ఒక ఎత్తు.. ఇక ముందు సాగే జర్నీ మరో ఎత్తు. ఎందుకంటే.. తెలంగాణ సరిహద్దులు దాటుకుని.. మహారాష్ట్ర మీదుగా ఢిల్లీ ఎర్రకోటకు చేరుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు గులాబీ దళపతి కేసీఆర్. టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ముందు ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సవాళ్లు. దేశవ్యాప్తంగా కేడర్, లీడర్లున్న కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలకు దీటుగా బీఆర్ఎస్‌ను నిలబెట్టగలరా?
ఆరు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఆ తర్వాత ఆరు నెలలకు పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ రెండూ మేజర్ సవాళ్లు. ఇటు.. తెలంగాణలో.. విపక్షాలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఉద్యమాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏకంగా కేసీఆర్ వారసుడు కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేటీఆర్‌ను మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌ను బలంగా వినిపిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు.
కేసీఆర్ కారు నేషనల్ హైవే ఎక్కిన తర్వాత ఆయన పార్టీని బీజేపీ గట్టిగానే టార్గెట్ చేస్తోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కమలనాథుల వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు. తెలంగాణ నిండా సమస్యలు తిష్ట వేస్తుంటే.. పాలకులకు అవన్నీ పట్టడం లేదంటూ బండి సంజయ్ ప్రజలసాక్షిగా విమర్శలు గుప్పిస్తున్నారు.
విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా.. తెలంగాణ మోడల్‌ను బలంగా ప్రమోట్ చేస్తోంది గులాబీ దళం. ఒక రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలను కూడా మోదీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేకపోతోందని విమర్శిస్తున్నారు. చేరికలతో బీఆర్ఎస్ బలోపేతంపై దృష్టి సారించారు. ముఖ్యంగా మహారాష్ట్రపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్. ఇప్పటికే పలు బహిరంగ సభలను నిర్వహించిన ఆయన.. జిల్లా పరిషత్‌లపై గులాబీ జెండా ఎగురవేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. వీలు దొరికినప్పుడల్లా ప్రధాని మోదీని టార్గెట్‌గా చేసుకుని మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు.
మహారాష్ట్రలో సభలు, చేరికలతో జోష్ మీదున్న బీఆర్ఎస్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కర్నాటకను ఎందుకు లైట్ తీసుకుంది? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎన్నికల ముందు వచ్చిన ఆవిర్భావ దినోత్సవం నాడు ప్లీనరీ కాకుండా.. సర్వసభ్య సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నట్టు? అనే ప్రశ్నలు ఎదురువుతున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా గులాబీ బాస్ వ్యూహాలకు పదును పెట్టారు. తాజాగా కేసీఆర్ రూటు మార్చారు. ఎన్నికల సమయం కావడంతో ఆత్మీయ సమ్మేళనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా BRS ప్లీనరీని గతంలో ఘనంగా నిర్వహించేవారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు ఈ ప్లీనరీకి హాజరయ్యేవారు. ఈసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 27న ఎల్బీ స్టేడియంలో పార్టీ ప్లీనరీని ప్లాన్ చేసినా.. తర్వాత రద్దు చేశారు. జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల వారీగా మినీ ప్లీనరీలకు పిలుపునిచ్చారు.
జనరల్ బాడీ సమావేశంలో రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. మోదీ వైఫల్యం, అదాని ఇష్యూ, రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్రం నిర్లక్ష్యం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతోపాటుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, సామాజిక భద్రత లాంటి అంశాలపై రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి అంశాలతోపాటుగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలు తీసుకుంటుంది అనే అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో అనుసరించాల్సిన వ్యూహంపై జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.
ఎన్నికల్లో కారు స్టీరింగ్‌ను ఎలా తిప్పాలో.. ప్రజల ముందు ఎలా ఆగాలో కేసీఆర్‌కు బాగా తెలుసు. 23 ఏళ్ల కారు జర్నీలో ఎన్నో సంక్షోభాలను అధిగమించారు. ఇప్పుడు తన ముందున్న సమస్యలు కూడా తెలుసు. ఢిల్లీ ఎర్రకోట లక్ష్యంగా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారు గులాబీ దళపతి.
Vasantha Krishnaprasad : రౌడీలను వెంటేసుకుని తిరగడమే నేటి రాజకీయం.. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..