
Jawan:- బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్ ఖాన్ చేస్తున్న తాజా చిత్రం ‘జవాన్’. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. జూన్ 2న సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి రెండు వీడియో క్లిప్స్ నెట్టింట లీక్ అయ్యాయి. ఈ లీకేజీలపై హీరో షారూక్ ఖాన్ కోర్టు మెట్లెక్కాడు. కేసుని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. జవాన్ సినిమా నుంచి లీకైన వీడియో క్లిప్స్ వల్ల సినిమాకు నష్టం కలుగుతుందని.. సినిమాలో నటీనటుల లుక్స్ అందరికీ తెలిసి పోతున్నాయని కాబట్టి వాటిని ఎక్కడా ప్రసారం చేయకూడదని కోర్టు తెలియజేసింది.
హీరో షారూక్ ఖాన్ తన సొంత రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై జవాన్ సినిమాను నిర్మిస్తున్నాడు. కొన్ని రోజుల ముందు ఈ మూవీ మూడు వారాల పాటు వాయిదా పడుతుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ న్యూస్‌ను మేకర్స్ ఖండించారు. ఇంతకు ముందు అనౌన్స్ చేసినట్లే జూన్ 2నే జవాన్ సినిమా రిలీజ్ అవుతుందని వారు తెలిపారు. తమిళంలో రాజా రాణి, తెరి, బిగిల్ వంటి చిత్రాలను తెరకెక్కించిన అట్లీ డైరెక్ట్ చేస్తోన్న తొలి బాలీవుడ్ మూవీ ఇది. షారూక్ ఖాన్ ఫ్యాన్స్ సహా ప్రేక్షకులు జవాన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఏడాది పఠాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన షారూక్ ఖాన్.. జవాన్‌తో తన సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని ఎదురు చూస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను మేకర్స్ పూర్తి చేశారు. పఠాన్ కంటే భారీగా జవాన్‌ను భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి ఇప్పటి నుంచే షారూక్ ఖాన్ ప్లాన్ చేసుకుంటున్నారు.