Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టైగర్ రిజర్వేషన్ రిజర్వ్ ఏర్పాటులో భాగంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 49ని రద్దు చేయాలని ఆదివాసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదివాసులకు నష్టం చేకూర్చేలా జీవో ఉందని బంద్ చేపడుతున్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా డిపో ప్రధాన గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.
ఆదివాసీలకు నష్టం చేకూర్చేలా ఉందని నిరసన
ఆదిలాబాద్‌తో పాటు ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, ఉట్నూర్, జన్నారంతో పాటు బోథ్ ,ఇచ్చోడలో ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అక్కడక్కడ తెరిచిన దుకాణాలను తిరిగి మూసేయించారు. ఉట్నూర్ డిపో ఎదుట ధర్నా చేపట్టడంతో.. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. భారత కమ్యూనిస్టు పార్టీ.. తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. లేఖలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పులుల సంఖ్యను ప్రస్తావించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న లక్షల మంది ప్రజల జీవితాలను విచ్ఛిన్నం చేయటానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తుందని పేర్కొన్నారు.
మంచిర్యాల దండేపల్లిలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో జీవో 49 ను రద్దుచేయాలని… దండేపల్లి లోని ప్రైవేట్ స్కూల్లు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్‌లో కూడా ఆదివాసీలు జీవో 49కు వ్యతిరేకంగా మద్దతు తెలిపారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేసి బంద్ నిర్వహించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: ఎండలకు తాళలేక తాలిబన్ డ్రైవర్ల తెలివైన ఆలోచన.. కార్లకు కూలరు బిగించి వినూత్న ప్రయత్నం
జీవో 49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండల్లాలో కూడా ఆదివాసి హక్కుల పోరాట సమితి బంద్‌కు పిలుపు నిచ్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో జీవో నెంబర్ 49 ద్వారా ఏజెన్సీలో ఉండే ఆదివాసులను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తుడుం దెబ్బ నాయకులు ఆరోపించారు. జీవో 49 ను రద్దుచేసి, జివో ఏంఎస్ 3ని పునరుద్ధరణ చేయాలని కోరారు. బంద్ నిర్వహించడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయి.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
జీవో 49 మీద ఆదివాసీలు, గిరిజనులకు ఎటువంటి ఆందోళన వద్దని… కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడవి బిడ్డలకు ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పునరుద్ఘాటించారు. ఆదిలాబాద్ ఇంచార్జీ మంత్రి జూపల్లి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆదివాసీ బిడ్డ సీతక్క సమిష్టిగా నిర్ణయం తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివేదించగా… ఆయన ఆదేశాల మేరకు సోమవారం జీవో 49 అబేయన్స్ లో పెడుతూ అటవీ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జీవో 49 మీద స్థానిక ఆదివాసీల్లో అనుమానాలు, అభ్యంతరాలు నెలకొన్న నేపథ్యంలో వాటిపై పలు దఫాలు మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీతక్క భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రులు సమావేశాలు నిర్వహించి, సమగ్ర వివరాలు సేకరించారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో స్థానిక కలెక్టర్ నుంచి మరొకసారి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం… ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. పులుల కారిడార్ కవ్వాల్ అభయారణ్యంలో భాగంగా ఉన్న ఆసిఫాబాద్ ప్రాంతాన్ని కుమురంభీం పులుల కన్జర్వేషన్ రిజర్వుగా మారుస్తూ గత నెల 30న అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, తిర్యా ణి, కాగజ్‌నగర్, సిర్పూర్, కర్జెల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్ రేంజ్‌లలో లక్ష 49 వేల హెక్టార్ల ను టైగర్ రిజర్వులోకి మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
జీవో విడుదల కోసం 330 ప్రభావిత గ్రామాల ప్రజల్లో నెలకొన్న అనుమానాలా నివృత్తి చేసేందుకు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో మంత్రులు సమగ్ర వివరాలు సేకరించారు. స్థానిక ఆదివాసీల విజ్ఞప్తి మేరకు… సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయాన్ని నివేదించి… అబేయన్స్ లో పెట్టాలని ప్రభుత్వం ముందడుగు వేసింది. అయితే, రానున్న రోజుల్లో కూడా ఆదివాసీలకు ఇబ్బందులకు రాకుండా చూసుకుంటామని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ హామీనిచ్చారు. తమ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ధ్యేయం అని వ్యాఖ్యానించారు.