⦿ అదానీతో బీజేపీకి లింక్ పెట్టొద్దు
⦿ మాకెలాంటి సంబంధం లేదు
⦿ కావాలని బురద జల్లడం మానుకోండి
⦿ కాంగ్రెస్ నిరసనలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
⦿ కౌంటర్ ఇచ్చిన జగ్గారెడ్డి
ఢిల్లీ, స్వేచ్ఛ: మోదీ, అదానీ బంధంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు దిగడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నిరాశలో కూరుకుపోయి, ఏం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. వరుస ఎన్నికల్లో ఓటమితో తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మహారాష్ట్ర, హర్యానా ప్రజలు చిత్తుగా ఓడించినా కూడా బుద్ధి రాలేదన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయలేకపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్ ఆపార్టీ నేతల్లో కనిపిస్తోందని సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీపై అసలు ప్రజా సమస్యలపై అవగాహన లేదన్న కిషన్ రెడ్డి, తెలిసీ తెలియకుండా మాట్లాడొద్దని హెచ్చరించారు. రాజ్ భవన్ ఎదుట ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని, అదానీ అంశంపై మాట్లాడే హక్కు మీకు లేదన్నారు. హామీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన జగ్గారెడ్డి
అదానీపై ఆధారాలు ఏమైనా ఉంటే ఇవ్వండని కిషన్ రెడ్డి అంటున్నారని, అసలు ఆయన సెంట్రల్ మినిస్టరేనా అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. అమెరికాలో మోసం చేశాడని చీటింగ్ కెసు పెట్టారని, ఇంకేం ఆధారం కావాలని అడిగారు. కిషన్ రెడ్డి సొంతంగా ప్రెస్ మీట్ పెట్టరని, ఆయనకు ఎవరో స్క్రిప్టు రాసిస్తే మాట్లాడతారని అన్నారు. అందుకే, ఆయన ప్రెస్ మీట్లలో క్లారిటీ ఉండదని సెటైర్లు వేశారు. ఆయన ఎక్కువ మాట్లాడితే పోస్ట్ ఊడిపోతుందని అన్నారు జగ్గారెడ్డి.