Crop Damage: స్వేచ్ఛ బ్యూరో: అకాల వర్షాలతో ఆరుగాలం పండించిన పంట తడిసి ముద్దవుతుంది. ఒకవైపు కొనుగోళ్లలో జాప్యం, మరోవైపు అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామనే సరికి ప్రకృతి కన్నెర్ర చేయడంతో గగ్గోలు పెడుతున్నారు. కొన్ని జిల్లాల్లో వరి ధాన్యంకోత దశలో ఉండటంతో రాళ్లతో కూడిన వర్షం పడటంతో వరిచేను నేలవాలింది. వడ్లు నేలపాలయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉపరితల ఆవర్తనం, క్యుములో నింబస్ మేఘాలు, ద్రోణి కారణంగా వర్షాలు పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 24 వరకు తేలిక పాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. ప్రభుత్వం సైతం రైతులు అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వడగళ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో కోత దశలో ఉన్న వరిచేను నేలవాలింది. వడ్లు సైతం రాలి నేలపాలయ్యాయి. మామిడి, బత్తాయి, నిమ్మ కాయలు సైతం నేలరాలాయి. దీంతో రైతులకు అపార నష్టం జరిగింది. దీనికి తోడు మొక్క జొన్న, జొన్న, బొప్పాయి తోటలు సైతం దెబ్బతిన్నాయి.
రైతులు మార్కెట్లకు కొంతమంది రైతులు ధాన్యం తీసుకొచ్చారు. మార్కెట్లో సరైన వసతులు లేకపోవడం, టార్ఫలిన్లు సైతం సరిపడ లేకపోవడంతో ధాన్యం తడిసి ముద్దైంది. నిజామాబాద్ జిల్లాలో సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన నానా బీభత్సం సృష్టించింది. చేతికి వచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. సిరికొండ, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి మండలంలో పొద్దంతా ఎండ కొట్టి సాయంత్రం అకాల వర్షం పడడంతో పంటను కాపాడుకోలేక రైతులు సతమతం అయ్యారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Also Read: ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ విమర్శలపై స్పందించిన అనన్య… అందుకే పెట్టానంటూ క్లారిటీ!
సోమవారం సైతంఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జైశంకర్ భూపాల పల్లి, ములుగు, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను జారీ చేశారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అధిక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. ఆ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా, రంగారెడ్డి, హైదారాబాద్, మెహబూబ్‌నగర్ జిల్లా, ములుగు, జైశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాల్లో కూడా తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస్తాయి.22న ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌లోనూ తేలికపాటి వర్షాలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు పసుపురంగు హెచ్చరికలను జారీ చేసింది.
ద్రోణి ఆవర్తనంతో పాటు, స్థానికి వాతావరణ పరిస్థితుల కారణంగా క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉదయం నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. మద్యాహ్న సమయంలో మేఘావృతమై వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురువడంతో ప్రజలు ఎండనుంచి ఉపశమనం పొందారు.
నల్లగొండ, కామారెడ్డితో పాటు పలు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఎన్జీ కొత్తపల్లిలో ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించారు. 15రోజులు దాటింది. కానీ లారీల కొరతకారణంగా కాంటా కావడం లేదని, కేవలం సీరియల్ ప్రకారం ఆరునుంచి 7 గురురైతుల ధాన్యం మాత్రమే కాంటా అయిందని రైతులు పేర్కొంటున్నారు. వందలాది మందిరైతులు సీరియల్ ప్రకారం ఉన్నారని ప్రభుత్వం స్పందించి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వర్షసూచన నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా మిర్యాలగూడలో రైస్ మిల్లర్లు దిగుమతిలో జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం అధికంగా ఉన్నాయని కొర్రీలు పెట్టడం రైతులపాలిట శాపంగా మారుతోంది.కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలం బైరపూర్‌లో ధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతుల ఆందోళన చేపట్టారు. సొసైటీకి తాళం రైతులు వేశారని రొడ్డెక్కారు. 15 రోజులుగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇలా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందని ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లను స్పీడప్ చేయాలని రైతులు విజ్ఞప్తులు చేస్తున్నారు.
Also Read: సైబర్ దొంగలతో బ్యాంకు సిబ్బంది కుమ్మక్కు.. 32 మంది అరెస్టు..!