Cyber Fraud: స్వేచ్ఛ బ్యూరో: ప్రజల డబ్బుకు కస్టోడియన్లుగా ఉండాల్సిన బ్యాంక్ సిబ్బందిలో కొందరు సైబర్ క్రిమినల్స్ తో చేతులు కలిపి కొల్లగొడుతున్నారు. లూటీ చేసిన డబ్బులో వాటాలు తీసుకుంటూ నేరగాళ్లకు సహకరిస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తాజాగా ఆపరేషన్ అక్టోపస్ 2.0 జరిపారు. వారం రోజులపాటు వేర్వేరు రాష్ట్రాల్లో దాడులు జరిపి 32మంది బ్యాంక్ సిబ్బంది సహా మొత్తం 52మందిని అరెస్ట్ చేశారు. వీరికి దేశవ్యాప్తంగా నమోదైన 850 కేసులతో సంబంధం ఉన్నట్టు విచారణలో తేలింది. ఈ కేసుల్లో 150 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు నిర్ధారణ అయ్యింది.
సైబర్ మోసాలకు చెక్ పెట్టటానికి ఓవైపు పోలీసులు విస్తృత చర్యలు తీసుకుంటున్నా మరోవైపు క్రిమినల్స్ నేరాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పెట్టుబడులు, బిజినెస్, డిజిటల్ అరెస్టుల పేర సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేస్తూ లక్షలు.. కోట్లు కొల్లగొడుతున్నారు. ఆందోళనాకరమైన అంశం ఏమిటంటే వీరికి కొంతమంది బ్యాంకుల సిబ్బంది సహకరిస్తుండటం. కమీషన్లు తీసుకుంటూ మ్యూల్ అకౌంట్లు తెరవటానికి.. వాటి నిర్వహణకు సహాయపడుతుండటం. కొన్ని కేసుల్లో బ్యాంక్ సిబ్బంది పాత్ర బయట పడిన నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. మొదటిసారి ఫిబ్రవరి నెలలో అక్టోపస్ 1 ఆపరేషన్ చేపట్టారు. దీంట్లో భాగంగా వేర్వేరు బృందాలుగా విడిపోయిన అధికారులు 16 రాష్ట్రాల్లో దాడులు జరిపి 117 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో కొందరు బ్యాంక్ సిబ్బంది ఉండటం గమనార్హం.
Also Read: పంది కడుపులో ఏనుగు పిల్ల కలకలం
ఈ ఆపరేషన్ లో వెళ్లడైన ఆధారాలతో సైబర్ క్రిమినల్స్ కు సహకరిస్తున్న బ్యాంక్ సిబ్బంది ఆట కట్టించే లక్ష్యంతో తాజాగా ఆపరేషన్ అక్టోపస్ 2.0 జరిపారు. సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి నేత్రుత్వంలో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారుల బృందాలు దాడులు జరిపాయి. దీంట్లో 32 మంది వేర్వేరు బ్యాంకుల సిబ్బందితోపాటు మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో 15మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, అయిదుగురు దళారులు కూడా ఉన్నారు. వీరికి దేశవ్యాప్తంగా జరిగిన 850 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్టు తేలింది. మొత్తం 350 అకౌంట్ల ద్వారా 150 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు నిర్ధారణ అయ్యింది. ఇక, నిందితుల నుంచి 26 మొబైల్ ఫోన్లు, 14 చెక్ బుక్కులు, 2 పెన్ డ్రైవ్ లు, ఒక ల్యాప్ టాప్, షెల్ కంపెనీలకు చెందిన 21 కంపెనీల స్టాంపులను సీజ్ చేశారు. దాడుల్లో సీసీఎస్ అధికారులు, డిటెక్టివ్ సీఐలు, ఏఆర్ బలగాలు పాల్గొన్నాయి.
ఆపరేషన్ అక్టోపస్ 2.0 లో పాల్గొని నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని హైదరాబాద్ సీపీ వీ.సీ.సజ్జనార్ అభినందించారు. సైబర్ నేరాలపై జీరో టాలరెన్సీ విధానాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కేవైసీ నిబంధనలను తుంగలో తొక్కుతూ సరైన ధ్రువీకరణ పత్రాలు లేకున్నా అకౌంట్లు తెరవటానికి సహకరిస్తుండటం వల్లనే మ్యూల్ అకౌంట్లు పుట్టుకొస్తున్నాయని చెప్పారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వ్యతిగత ఖాతాలను ఇతరులు వాడుకోవటానికి ఇచ్చే వారిపై కూడా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉంటే చాలావరకు వీటిని అడ్డుకోవచ్చని చెప్పారు. అత్యాశకు పోయి సైబర్ క్రిమినల్స్ వలలో చిక్కుకొవద్దని సూచించారు. డిజిటల్ అరెస్టులు ఉండవన్న విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్ కు ఫిర్యాదు చెయ్యాలన్నారు.
Also Read: తెలంగాణ సర్కార్ సంచలనం.. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విప్లవం