Collectorate Bomb Threat: తెలుగు రాష్ట్రాల్లో వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తిరుపతిలో ఉన్న పలు హోటల్లు, రెస్టారెంట్లతో పాటు కలెక్టరేట్‌కు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేయించారు. బాంబ్ ఏమీ కనిపించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు.
ఈ ఘటన మరువక ముందే తెలంగాణలో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేగింది. 3:30 గంటలకు కలెక్టరేట్ పేల్చేస్తాం.. అంటూ గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ సిబ్బందికి ఈ మెయిల్ వచ్చినట్లు సమాచారం. ముప్పల లక్ష్మీనారాయణ అనే మెయిల్ ఐడీతో మెసేజ్ వచ్చింది. బెదిరింపు మెయిల్‌లో అల్లా అక్బర్ అని కూడా ఉందని కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ తెలిపారు. దీంతో అప్రమత్తమైన కలెక్టరేట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
కలెక్టరేట్‌కు చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో కలెక్టర్ ఆఫీస్ మొత్తం తనిఖీ చేయించారు. దీంతో పాటు క్వార్టర్స్‌లో కూడా సెర్చ్ ఆపరేషన్ జరిపారు. బాంబ్ కానీ ప్రమాదకరమైన వస్తువులు కానీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం ఏమీ లేదని నిర్దారించుకున్న తరువాత కలెక్టరేట్ నుంచి వెళ్లిపోయారు.
అయితే ఎవరో కావాలనే ఫేక్ మెయిల్ పంపించి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులకు ఐడీ వివరాలు ఇచ్చినట్లు వెల్లడించారు. నిందితులు దొరికితే బెదిరింపులు పాల్పడినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.