
Vijayashanti : తాను కాంగ్రెస్ లో చేరడానికి కారణం బీజేపీనే అని విజయశాంతి తెలిపారు. శుక్రవారం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆమెకు.. పార్టీ హై కమాండ్ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఈ క్రమంలో విజయశాంతి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం తన జీవితాన్నే త్యాగం చేశానని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతిని వెలికితీస్తామని చెప్పిన బీజేపీ పెద్దలు.. ఎన్నికలకు నాలుగునెలల ముందు బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించారన్నారు. అప్పటికే ఆయనను పదవి నుంచి తొలగించవద్దని హై కమాండ్ కు చెప్పానని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పినా వినలేదని విజయశాంతి ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని సీఎం కేసీఆరే ఢిల్లీకి వెళ్లి చెప్పారని, ఆయన మాటప్రకారమే హై కమాండ్ ఆయన్ను తొలగించిందన్నారు. బీజేపీ తెరముందు చాలా మాటలు చెబుతుందని, తెరవెనుక అనేక ఒప్పందాలుంటాయని విజయశాంతి విమర్శించారు. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెప్పిన మాటపై నమ్మకంతో ఆ పార్టీలోకి వెళ్తే.. నెలలు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. కార్యకర్తలను, ఉద్యమకారులను నమ్మించ మోసం చేసిందని దుయ్యబట్టారు. ఎన్నో ఏళ్లుగా చూస్తున్నా.. మోదీ ఇంక కేసీఆర్ పై చర్యలు తీసుకోరని అర్థమై కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు వివరించారు.
బండి సంజయ్ ను పదవి నుంచి తప్పించడంతోనే బీజేపీ చతికిలపడిపోయిందన్నారు. జాతీయ స్థాయి పార్టీ అయిన బీజేపీని తీసుకెళ్లి కేసీఆర్ పాదాలవద్ద పెట్టారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ధరణిపోర్టల్ లో అవినీతి జరిగిందన్న బీజేపీ.. బీఆర్ఎస్ పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. బీజేపీ తనను తానే చేజేతులా నాశనం చేసుకుందన్నారు. బీజేపీ హైకమాండ్ కేసీఆర్ ట్రాప్ లో పడిందని, ఆ పార్టీలో కేసీఆర్ నాటిన మొక్క ఈటల అని, ఆయన వల్లే పార్టీ భూస్థాపితం అవుతుందని విమర్శనాస్త్రాలు సంధించింది రాములమ్మ. అసైన్డ్ భూముల అంశంలో.. పార్టీ నుంచి బహిష్కరించిన బీఆర్ఎస్.. ఆ తర్వాత ఆ ఇష్యూపై ఎందుకు నోరు మెదపలేదు, ఈటలపై పెట్టిన కేసులు ఏమైపోయాయని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రజలు ఆలోచించాలని హితవు పలికారు.