
Gaza-Starvation : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఆరంభమై ఏడోవారం. ఉత్తర గాజా పూర్తిగా వశం కావడంతో.. ఇజ్రాయెల్ బలగాలు దక్షిణ గాజాపై దాడులకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే గాజాలో 45% మేర ఆవాసాలు నేలమట్టమయ్యాయి. తాజాగా శనివారం ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) విరుచుకుపడింది.
ఈ దాడుల్లో 26 పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చిన్నారులే అధికం. ఆహారం అందే మార్గం లేక గాజా పౌరులు ఆకలిచావులకు గురయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) ఆందోళన చెందుతోంది. ఇంధనం లేక ఇంటర్నెట్, టెలిఫోన్ సర్వీసులు స్తంభించిపోవడంతో.. గాజాకు ఆహారం, ఇతర నిత్యావసరాల సరఫరాను బలవంతంగా నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొందని ఐరాస అధికారులు వాపోయారు.
ఐరాస బృందంతో పాటు టెలికమ్యూనికేషన్ల వ్యవస్థల పునరుద్ధరణ కోసం రెండు టాంకర్ ట్రక్కుల ఇంధనాన్ని అందజేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇది ఎంత మాత్రం సరిపోదని సహాయక బృందాలు వాపోతున్నాయి.
గాజాపై సైనిక చర్య కారణంగా ఇప్పటికే 12000 మందికిపైగా మరణించారు. వారిలో 5 వేల మంది చిన్నారులేనని హమాస్ ప్రకటించింది. మరో 3750 మంది ఆచూకీ తెలియడం లేదు. వారంతా శిథిలాల్లో కూరుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఉత్తర గాజాను ఇప్పటికే 1.6 మిలియన్ల మంది ప్రాణాలు అరచేత పట్టుకుని దక్షిణ గాజాకు తరలిపోయారు. ఓ వైపు వలసలు పెరగడం, మరోవైపు ఆహార సరఫరాకు ఆటంకాలు కలుగుతుండటంతో ఆకలికి అలమటించే దుస్థితి నెలకొనవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.