వరంగల్ ఆక్రమణలపై స్వేచ్ఛ స్పెషల్ పార్ట్ 1
– ఆక్రమణలపై తగ్గేదే లేదంటున్న సీఎం
– జిల్లాల్లోనూ కలెక్టర్లకు కీలక ఆదేశాలు
– వరంగల్‌లో విచ్చలవిడిగా ఆక్రమణలు
– గొలుసు కట్టు చెరువులు తెంచడంతో మునుగుతున్న నగరం
– దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న చెరువుల పరిరక్షణ సమితి, స్వచ్ఛంద సంస్థలు
– పట్టించుకోని గత బీఆర్ఎస్ పాలకులు
– వాడ్రా రావాలి వరంగల్‌ను మార్చాలంటున్న నగర ప్రజలు
– సీఎం వాఖ్యల తర్వాత వరంగల్‌లో మొదలైన వైబ్రేషన్
సతీష్ పబ్బు, స్వేచ్ఛ వరంగల్ ఇన్వెస్టిగేషన్ టీం
Warangal: ప్రకృతి మీద మనం దాడి చేస్తే, మన మీద తిరిగి దాడి చేస్తుంది. ఈమధ్య వచ్చిన వరదలే అందుకు నిదర్శనం. ఇష్టారీతిన ఆక్రమణలు జరిగితే వరద నీరు ఎలా ముంచెత్తుతుందో మనకు దర్శనం ఇచ్చింది. అయితే, చెరువులు, నాలాల ఆక్రమణపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. ఖమ్మం, మహబూబాబాద్ వరదల తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. హైడ్రా లాంటి సిస్టమ్ ప్రారంభించాలన్నారు. నాలాలు, చెరువుల ఆక్రమణలను కూల్చివేయాలని, ఎంత ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం వెనక్కి తగ్గదన్నారు. మహబూబాబాద్‌లో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వరంగల్‌లో వైబ్రేషన్స్ తీసుకొచ్చాయి. హైదారాబాద్‌లో హైడ్రా లాగా వరంగల్‌లో వాడ్రా వస్తుంది, ఆక్రమణలు కూల్చివేసి నగరాన్ని ముంపు నుంచి కాపాడుతుందని నగర ప్రజలు, మేధావులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు, పాలకులదే పాపం
కాకతీయులు అంటేనే ప్రణాళికాబద్ధమైన గొలుసు కట్టు చెరువులకు ప్రసిద్ధి. వందల ఏళ్ల క్రితమే తాగు, సాగు నీటికి ఇబ్బంది కలుగకుండా ఉండేలా వేలాది చెరువులను క్రమ పద్ధతిలో ఒకదానికొకటి అనుసంధానిస్తూ వరద ఎక్కడా నిలువకుండా నిర్మాణం చేశారు. వరంగల్ నగర అభివృద్ధి జరుగుతున్న కొద్దీ చెరువులు కబ్జా చేసి నాలాలు నామరూపాలు లేకుండా చేశారు కొందరు. వందల ఎకరాలు భూములు ఆక్రమణకు గురయ్యాయి. కొందరు నేతలు కూడా తమ కోసమే వదిలేశారు అన్నట్టు చెరువులను చెరబట్టి, కుంటలనూ కబ్జా చేసి యథేచ్ఛగా భవన నిర్మాణాలు చేశారు. కానీ, గ్రేటర్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. మామూళ్ల మత్తో లేక అధికారానికి తలొగ్గో వారు చేసిన ఆ పాపమే, ఇప్పుడు మహా నగరానికి శాపంగా మారిందని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాడ్రా కావాలంటున్న నగర వాసులు
అక్రమ నిర్మాణదారుల వెన్నులో హైడ్రా వణుకు పుట్టిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను చెరబట్టిన ఆక్రమణదారులను గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా తరహాలో వరంగల్‌లో వాడ్రా కావాలని జీడబ్ల్యూఎంసీ (గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్) ప్రజలు కోరుకుంటున్నారు. హైడ్రా చర్యలు మొదలైన నాటి నుంచి వరంగల్ మహా నగరంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలోనూ అదే చర్చ నడుస్తోంది. హైడ్రా తరహాలో వరంగల్ నగరంలోనూ అక్రమార్కులు చెరబట్టిన చెరువులకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు. ఏకంగా ఫోరం ఫర్ బెటర్ వరంగల్, చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేధావులు చర్చ వేదికలు ఏర్పాటు చేసి వాడ్రా కావాలని కోరుతున్నారు. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ డిజాస్టర్ స్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటక్షన్ (హైడ్రా) కొరడా ఝులిపించినట్టే వరంగల్‌లోనూ వాడ్రా (వరంగల్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటక్షన్) యాక్షన్ కావాలని అడుగుతున్నారు.
Also Read: Mallu Bhatti Vikramarka: రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఇక వాటికి ఉచిత విద్యుత్
అంతే లేని ఆక్రమణలు
ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు అనేక మంది హైడ్రా విషయంలో గుబులు చెందుతున్నారు. హైడ్రా బుల్డోజర్ల ధాటికి బహుళ అంతస్తులే నేల మట్టం అవుతున్నాయి. ఓరుగల్లులో అంతు లేని ఆక్రమణలు జరిగాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 86 చెరువులు, కుంటల శిఖం భూములు ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నాయి. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిబంధనలను తుంగలో తొక్కి రాజకీయ అండ, అధికారుల సహకారంతో బరి తెగించారు. ఈ దురాగాతం వరంగల్ మహానగరంలో పదేళ్లకుపైగా యథేచ్ఛగా కొనసాగుతోంది. అయినప్పటికీ పాలకులు, అధికారుల్లో చలనం లేదు. దీంతో కబ్జాదారుల ఆక్రమణకు అంతులేకుండా పోతోంది. అందుకే హైడ్రా తరహాలో వాడ్రా కావాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. ఇష్టా రాజ్యంగా పర్మిషన్స్
గ్రేటర్ వరంగల్ పరిధిలో గ్లోబల్ జియో గ్రాఫికల్ ఇషన్ సిస్టమ్ (జీఐఎస్)తో 2015 సంవత్సరంలో 20 చెరువులు, కుంటలను గుర్తించారు. వీటికి ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ సరిహద్దులను ఏర్పాటు చేయాలని బల్దియాకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కంటి తుడుపుగా బల్దియా అధికారులు, సిబ్బంది, చెరువులు, కుంటలను గుర్తించి బల్దియా వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. వందల సంఖ్యలో చెరువులు, కుంటలు మాయమైనట్లు వెల్లడించారు. ఈ ఆక్రమణలను నిలువరించాల్సిన గ్రేటర్ వరంగల్, రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులు వాస్తవ సర్వే ఆధారంగా ఆక్రమణల నిగ్గు తేల్చి చెరువులు, కుంటలను వారే రక్షించాలి. కానీ, తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా బల్దియా అధికారులు ఇంటి నెంబర్లు, నల్లా కనెక్షన్లు ఇవ్వడంతో కబ్జాదారులకు వరంగా మారి కాసుల వర్షం కురుస్తోంది.
వరంగల్‌లో వాడ్రా ఎందుకు? కబ్జాకు గురైన చెరువులెన్ని? గత పదేళ్లలో జరిగిందేంటి? పక్కా ఆధారాలతో తర్వాతి కథనంలో చూద్దాం.