Deputy CM Mallu Bhatti Vikramarka Free Electricity Supply: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లోని రవీంధ్రభారతి ఆడిటోరియంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గురువులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. ఈ మేరకు 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులుకు ఆయన చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం విద్యాసంస్థల గురించి మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఈ ఉచిత విద్యుత్ విద్యాసంస్థల్లో నేటి నుంచే అమలులోకి వస్తుందని, జీఓ కూడా విడుదల చేశామని వెల్లడించారు.
ప్రస్తుతం కంపెనీల అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థ లేదని, అందుకే మన విద్యా విధానాలు మారాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు నైపుణ్య యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామన్నారు. మన విద్యార్థులు అంతర్జాతీయంగా పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నారు.
Also Read: మంత్రి ఉత్తమ్ కీలక నిర్ణయం.. చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు టెండర్లు
సమాజాన్ని సన్మార్గంలో పెట్టడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అన్నారు. అదృష్టశాత్తు మన రాష్ట్రంలో ఆదర్శమైన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ నిర్ణయాలను మన గురువులు పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిన సందర్భంలోనూ ఉపాధ్యాయులు సహకరించారని గుర్తు చేశారు. సమాజం గొప్పగా మారాలంటే గురువులతోనే సాధ్యమన్నారు.