BigTV English

Kaleshwaram Scam: ఏంది సార్లు ఇది.? ప్రాజెక్ట్ కట్టింది నీళ్ల కోసం కాదా.! పైసలు దోచుకోవడానికా.?

Kaleshwaram Scam: ఏంది సార్లు ఇది.? ప్రాజెక్ట్ కట్టింది నీళ్ల కోసం కాదా.! పైసలు దోచుకోవడానికా.?

Kaleshwaram Scam: కాశేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రవహించిన నీళ్లెన్నో తెలీదు కానీ, ఈ ప్రాజెక్టు ద్వారా వెలికి వస్తున్న అవినీతి అధికారుల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉందా? మొన్న హరిరాం, నిన్న నూనె శ్రీధర్, నేడు మురళీధర్ రావు ఉదంతాలు మనకేం చెబుతున్నాయి? మురళీధరరావుకు ఇన్నేసి కోట్ల రూపాయల ఆస్తులెలా వచ్చాయి? ఈ ముగ్గురి ఆస్తులె ఇంత ఉంటే, ఇక కిందున్న వారి ఆస్తులెంత? పైనున్నవారు కాజేసినది ఇంకెంత? ఆ డీటైల్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.


90 వేల కోట్ల ఈ ప్రాజెక్టు నీళ్ల కోసం కాదా?

వీరి ఆస్తుల విలువే ఇన్ని వందల కోట్లు పలుకుతుంటే.. కింది స్థాయి అధికారుల వాటా ఎంత? పైనున్న వారు వెనకేసిన కట్టల పాములెన్ని? 90 వేల కోట్ల ఈ ప్రాజెక్టు నీళ్ల కోసం కాదా? అక్రమాస్తులు పోగెయ్యడం కోసమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రాజెక్టు వ్యవహారంలో మొదట బయట పడ్డ అవినీతి తిమింగలం భూక్యా హరిరాం అక్రమాస్తుల విలువ చూసి ఆశ్చర్యపోయారందరూ. ఆయన ఎంత ఈఎన్సీగా పని చేసినా.. మరీ ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టడం సాధ్యమయ్యే పని కాదు. అసలు ఆ ఆస్తుల వివరాలు తెలుసుకునే కొద్దీ కళ్లు బైర్లు కమ్ముతాయి. మొత్తం 14 ప్రాంతాల్లో సోదాలు చేసిన గుర్తించిన అధికారులు.. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇళ్లు, షేక్ పేట్ లో ఒక విల్లా, కొండాపూర్లో మరో విల్లా, మాదాపూ్ లో ఒక ఫ్లాట్, నార్సింగిలో ఒక ఫ్లాట్, అమరావతిలో ఒక కమర్షియల్ సైట్, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పఠాన్ చెరులో 20 గుంటల భూమి, బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోటతో కూడిన ఫామ్ హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం, కుత్బుల్లా పూర్, మిర్యాలగూడలో స్థలాలు.. గుర్తించారు అధికారులు. వీటికి తోడు బంగారు ఆభరణాలు, ఇతరత్రా విలువైన వస్తువుల విలువ కట్టిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. మూడు బ్యాంకు లాకర్లతో పాటు ఆయన భార్య ఇతర బంధుమిత్రులపేరిట కొన్న బినామీ ఆస్తులన్నిటినీ గుర్తించిన అధికారులకు మతి పోయింది.


వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ భవనాలు

ఇక సెకండ్ వికెట్ సంగతి చూస్తే. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా పని చేసిన.. నూనె శ్రీధర్ అవినీతి బాగోతం.. అబ్బో అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది. 19 రెసిడెన్షియల్ ప్లాట్లు, హైదరాబాద్ లోని తెల్లాపూర్ లో విల్లా, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ లో మూడు ఇండివిడ్యువల్ భవనాలు. 16 ఎకరాల వ్యవసాయ భూమి, కరీంనగర్ లో వివిధ హోటళ్లలో వాటాలు గుర్తించి షాకయ్యారు ఏసీబీ అధికారులు. మరో ట్విస్ట్ ఏంటంటే శ్రీధర్ తన కొడుకు పెళ్లిని ఏకంగా థాయిల్యాండ్ లో భారీ వ్యయం చేసి జరిపినట్టు తెలిసింది. విపరీతమైన అక్రమాదాయం గల శ్రీధర్ ఈ డబ్బు ఎలా ఖర్చు చేయాలో అర్ధం కాక.. కొడుకు పెళ్లిని విదేశాల్లో గ్రాండ్ గా చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం పట్టుబడ్డ మాజీ ఈఎన్సీ మురళి అవినీతి సరళి ఎలా ఉందో చూస్తే.. ఈయన సంతకం చేయనిదే బిల్లులు పాస్ కావు. ఈ అధికారం అడ్డు పెట్టుకుని.. మురళీధర్ రావు.. భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్టు గుర్తించింది ఏసీబీ. ఆయన బంజారా హిల్స్ నివాసం, కరీంనగర్, జహీరాబాద్, హైదరాబాద్ లోని ఆయన బంధుమిత్రుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులకు దిమ్మతిరిగిపోయింది. భారీ ఎత్తున అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు అధికారులు.

కొడుకు కంపెనీకి కాళేశ్వరంలో సబ్ కాంటాక్టు

మురళీధర్ రావుకు కొండాపూర్ లో ఒక విల్లా ఉన్నట్టు గుర్తించారు. బంజారాహిల్స్,యూసఫ్ గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో ఫ్లాట్లు ఉన్నాయి. ఇక కరీంనగర్ లో ఒక కమర్షియల్ బిల్డింగ్, హైదరాబాద్ లో మరో కమర్షియల్ బిల్డింగ్ ఉన్నట్టు బయట పడింది. కోదాడలో ఒక అపార్ట్ మెంట్ కూడా ఉన్నట్టు తేలింది. జహీరాబాద్ లో 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ పవర్ ప్రాజెక్టు ఉన్నట్టు గుర్తించారు. వరంగల్ లో ఒక అపార్ట్ మెంటును కట్టినట్టు చెబుతున్నారు అధికారులు. అంతేనా 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు కూడా డాక్యుమెంట్లు దొరికాయి. హైదరాబాద్ లో ప్రైమ్ ఏరియాల్లో నాలుగు రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్నట్టు పత్రాలు లభించాయి. మోకిలాలో మరో 6500 గజాల ప్లాట్ గుర్తించారు. మూడు ద్విచక్రవాహనాలు, ఒక మెర్సిడెస్ బెంజ్ కారు ఉన్నట్టు తేలింది. పెద్ద మొత్తంలో బంగారు నగలు, డిపాజిట్లు ఉన్నట్టు తేల్చారు. దీంతో మురళీధర్ రావుపై అక్రమాస్తుల కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అంతే కాదు తన కొడుకు అభిషేక్ రావు పేరిట ఉన్న ఒక కంపెనీకి కాళేశ్వరంలో సబ్ కాంట్రాక్టులు ఇప్పించినట్టు తెలిసింది.

ఉమ్మడి ఆంధ్ర ప్రభుత్వంలోనే మురళీధర్ రావు రిటైర్

ఈ మొత్తం డీటైల్స్ చాలు.. వీరక్కడ ఏం చేశారో చెప్పడానికి. ఎవరికి వారు అందిన కాడికి దోచుకోవడం. ఎడా పెడా ఆస్తులు కూడబెట్టడం. వీళ్ల బ్యాంకు బ్యాలెన్సులెంత బలపడుతూ వచ్చాయో.. ప్రాజెక్టు నిర్మాణం అంత బలహీన పడుతూ వచ్చిందని అంటారు నిపుణులు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మురళీధర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే రిటైర్ అయితే.. తిరిగి ఆయన పదవీ కాలం 13 ఏళ్ల పాటు పొడిగించారు. మేడిగడ్డ విజిలెన్స్ రిపోర్టు వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన్ను తొలిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంతలేసి తవ్వకాలు సాగించారో తెలీదు గానీ.. ఈ భారీ అవినీతి తిమింగలాల అవినీతిని తవ్వి పోయడానికి పెద్ద ఎత్తున కష్టపడాల్సి వచ్చింది ఏసీబీ అధికారులు. ఉన్నది చెబితే చాలు అసలేం జరిగిందో అదే తెలిసిపోతుంది. కాళేశ్వరం విషయంలో సరిగ్గా ఇదే జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ పట్టుబడ్డ ముగ్గురు అధికారులే ఇంత పెద్ద మొత్తంలో వెనకేస్తే.. మిగిలిన వారి పరిస్థితేంటి? అన్నది ఆందోళనకరంగా మారింది. మరీ ముఖ్యంగా మురళీధరరావు లీలలు ఈ మొత్తం ప్రాజెక్ట్ లోనే ప్రత్యేక అధ్యాయంగా చెబుతారు. అంతగా ఈయన అవినీతి లీలల వెలికి వచ్చాయని చెబుతారు అవినీతి నిరోధకశాఖ అధికారులు.

ఆ కాంట్రాక్టర్, ప్రభుత్వంపై జనాగ్రహం

కాళేశ్వరం ప్రాజెక్టు విలువ.. లక్ష కోట్లకు పైగా. ఇదంతా ప్రజా ధనమే. ఎందరో శ్రామికులు, మరెందరో కష్టార్జితం ఇందులో దాగి ఉంటుంది. అలాంటి ప్రజా ధనం మేసిన ఒక్కో అవినీతి అధికారి బాగోతం బయట పడుతుండటంతో.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు. ఏంటీ అన్యాయం? ఎందుకింతటి అక్రమం? ఒక వేళ ఇదే ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాయానికి ఆయువు పట్టుగా మారితే.. ఈ కీర్తి మనకే దక్కుతుందన్న ఆలోచన వీరెందుకు చేయలేక పోయారు? ఇదీ ప్రస్తుతం సర్వత్రా జరుగుతోన్న చర్చ. ఎప్పుడో కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల నాణ్యత గురించి వాటి మన్నిక గురించి ఇంకా కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ ప్రధాని కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.. ఈ జమిందారు ఇందుకు భూములిచ్చారని ఇంకా తలుచుకుంటూనే ఉన్నాం. ఈ గొప్ప అవకాశాన్ని వీరంతా కోల్పోయారా? అంటే అవుననే తెలుస్తోంది. గుజరాత్ లో నలభై ఏళ్ల క్రితం కట్టిన ఒక బ్రిడ్జి కూలిపోతే.. ఆ కాంట్రాక్టర్ ని, ప్రాజెక్టు నిర్మించిన నాటి ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్య పడుతూ పోస్టులు పెడుతున్నారు కొందరు. అంటే మనం కళ్లు మూసుకుని పాలు తాగేస్తే.. తర్వాత ఎవ్వరూ గుర్తించరులే అనుకుంటే పొరబాటు. చరిత్ర ప్రతిదీ గుర్తు పెట్టుకుంటుంది. ఈ కనీస విచక్షణ లేకుండానే వీరంతా కలసి.. ఈ ప్రాజెక్టుతో ఒక ఆట ఆడుకున్నట్టు కనిపిస్తోంది. డబ్బు కక్కుర్తికి చరిత్ర హీనులుగా మిగిలిపోవడానికి కూడా వీరు వెనకాడలేదని తెలుస్తోంది.

మాజీ ఈ ఎన్సీ మురళీధరరావు కథే వేరు

తాజాగా పట్టుబడ్డ మాజీ ఈఎన్సీ మురళీధరరావు కథే వేరుగా చెబుతారు. ఆయన ప్రతి సంతకానికీ ఒక విలువ కట్టినట్టు తెలుస్తోంది. బిల్లు పాసు కావాలంటే సార్ ఖాతాలో పెద్ద మొత్తం జమ కావల్సిందేనట. ఈయన ఈఎన్సీ అడ్మిన్ గా పని చేసినపుడు.. కాంట్రాక్టర్ల ద్వారా తన సన్నిహితులకు సబ్ కాంట్రాక్టులు ఇప్పించారట. తన కుమారుడ్ని బలవంతానా ఒక కంపెనీలో డైరెక్టర్ గా చేర్చి.. మరీ అక్రమార్జన చేశారంటే అర్ధం చేసుకోవచ్చని అంటారు అధికారులు. చేసే అవినీతి ఎక్కడా బయట పడకుండా ఇలాంటి ఎత్తుగడ వేసినట్టుగా గుర్తించారు. సబ్ కాంట్రాక్టు పనులలో నాటి మంత్రుల అనుచరులు.. వరంగల్ కి చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మేఘా కంపెనీ ఉద్యోగి, మాజీ ఈఎన్సీ వెంకటరామారావు ద్వారా కూడా తతంగం నడిచినట్టు అనుంటున్నారు. అతడి లీలలే కాళేశ్వరం కరెప్షన్ కి దారి తీసినట్టు తెలుస్తోంది. 2019లో రిటైర్ అయిన ఎస్ వెంకటేశ్వర్లను ఈఎన్సీ బాధ్యతలిచ్చి కొనసాగించారు. ఇపుడు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి ఈయనే అప్పట్లో ఈఎన్సీ. రివైజ్ అంచనాలతో వందల కోట్లు అక్రమంగా వివిధ కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఒక్క బ్యారేజీకే వంద సార్లకు పైగా.. ఎస్టిమేషన్ పెంచి నాణ్యత గాలికి వదిలినట్టు తెలుస్తోంది. ఈయన అక్రమాస్తులపై కూడా ఏసీబీ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అలాగే కాళేశ్వరం కమీషన్ కూడా ఈ మొత్తం అవినీతి బాగోతంపై సీరియస్ గా ఉన్నట్టు చెబుతున్నారు.

ఇక ప్రాజెక్టు సృష్టికర్తల అవినీతి పరిస్థితి ఏంటి?

ఈ మధ్య కాలంలో అరెస్టయిన అధికారులెవరని చూస్తే.. 2025 జూలై 15న మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీ ధరరావు. జూన్ 10న ఇరిగేషన్ ఎగ్జిక్యూఇవ్ ఇంజినీర్ నూనె శ్రీధర్. మే 10న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్ అర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి- అరవై వేలు లంచం తీస్కుని పట్టుబడ్డం. 2024 డిసెంబర్ 12న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నికేష్ కుమార్. ఈయన వంద కోట్ల అక్రమాస్తుల కేసులో అరెస్ట్. ఇక ఇదే ఏడాది జూన్ 1న రంగారెడ్డి జిల్లాకు చెందిన ఈఈ భన్సీలాల్, ఏఈ కార్తిక్, నవంబర్ 25న పెద్దపల్లి జిల్లాకు చెందిన ఏఈ నర్సింగరావు- 20 వేలు లంచం తీస్కుంటు బుక్. ఏప్రిల్ 26న కాళేశ్వరం ప్రాజెక్ట ఇంజినీర్ ఇన్ చీఫ్ భూక్యా హరిరాం- ఆదాయానికి మించిన కేసుల్లో అరెస్టయ్యారు. వీరి అక్రమార్జనే ఇలా ఉంటే.. ఇక ఈ ప్రాజెక్టు సృష్టికర్తల అవినీతి పరిస్థితి ఏంటి? అసలీ ప్రాజెక్టు అంచనాలు పదే పదే పెంచిందే అంతులేని అవినీతికి పాల్పడ్డానికా? ప్రాజెక్టుల విషయంలో ఇలాంటి అవినీతి బాగోతం బయట పడితే.. విదేశాల్లో అయితే ఏకంగా ఉరి శిక్ష విధిస్తారని అంటారు న్యాయ నిపుణులు. ఎందుకంటే ఒక ప్రాజెక్టు అంటే అది ఎన్నో ప్రాంతాలు, మరెన్నో జీవితాలకు సంబంధించిన విషయం. ఒక్కోసారి ప్రాజెక్టు నిర్మాణంలో తేడా వస్తే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. ఇందులో ఆస్తి, ప్రాణ నష్టాలు కూడా భారీగానే ఉంటాయి.

అంచెలంచెలుగా అంచనాలు పెరిగి లక్ష కోట్లు క్రాస్

తెలంగాణలోని 13 జిల్లాలకు ప్రయోజనం చేకూరేలా.. మొదట ఈ ప్రాజెక్టును 80 వేల 500 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టగా.. అంచెలంచలుగా అంచనాలు పెంచుతూ ఈ మొత్తం విలువ లక్ష కోట్లు దాటించినట్టు తెలుస్తోంది. రాజలింగం వంటి వారు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించిన ప్రజల సొమ్ము దోచిన వారెవరో తేలాల్సిందే అంటూ.. వాజ్యాలు వేయడం.. సంగతి తెలిసిందే. మరి అధికార గణం విషయలోనే ఇన్నేసి లుకలుకలు- లాలూచీలు- ఆమ్యామ్యాలు బయట పడుతుంటే.. ఆ పైనున్న గత పాలక పెద్దల పరిస్థితేంటి? ఆ మొత్తం అవినీతి విలువ ఇంకెంత మేర ఉంటుందో ఊహించడానికే భయమేస్తుందని అంటున్నారు నిపుణులు.

Story By Adhinarayana, Bigtv

Related News

Rangareddy News: బిర్యానీలో బొద్దింకలు.. తాండూరులో ఆ హోటల్ బాగోతం

Formula-E Race Case: ఫార్ములా రేస్ కేసు.. గవర్నర్‌కు నివేదిక, అనుమతి తర్వాత కేటీఆర్‌ అరెస్ట్?

Telangana politics: క్లారిటీ ఇచ్చిన లోకేష్.. ఔను ఇద్దరం కలిశాం, కవిత టీడీపీలోకి వస్తే

Formula E race case: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన పరిణామం.. ప్రభుత్వానికి ఏసీబీకి నివేదిక

Weather update: మళ్లీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన, జాగ్రత్త!

Warangal Incident: ‘నా భార్యతో ప్రాణహాని ఉంది’.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన భర్త

Big Stories

×