జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఉగాది రోజున ప్రకటన ఉంటుందని ప్రస్తుత రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ మేరకు పార్టీ సిద్ధాంతాలను సైతం ఆమె ప్రిపేర్ చేయిస్తున్నట్టు తెలుస్తుండగా.. జాగృతి సీనియర్ నాయకులతో ఆమె స్టీరింగ్ కమిటీ వేసి క్షేత్రస్థాయిలో తెలంగాణ సమస్యలపై నజర్ పెట్టినట్టు సమాచారం. సామాజిక తెలంగాణే లక్ష్యంగా ఆమె పార్టీ రాజ్యాంగం ఉంటుందని టాక్ వినిపిస్తున్నది. అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీలో అసహనానికి గురైన ఉద్యమకారులను ఏకం చేసి తనతో చేర్చుకునే పనిలో కవిత ఉన్నట్టు తెలుస్తున్నది.
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటిస్తే తెలంగాణ ప్రజలు ఆమెను ఆదరిస్తారా? అన్న అనుమానం కలుగకమానదు. ఎందుకంటే ఆమెను నేటికీ కేసీఆర్ కూతురుగానే ప్రజలు చూస్తున్నట్టు తెలుస్తున్నది.మొన్నటివరకు ఆమె గులాబీ పార్టీలో పలు పదవులను అనుభవించారు.గత పదేండ్ల కాలంలో నిజామాబాద్ ఎంపీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పనిచేశారు. అప్పుడు ఆమె పెద్దగా ఎవరినీ పట్టించుకోలేదని.. నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని ఎన్నికల్లో ప్రకటించి ఎంపీగా గెలిచిన ఆమె.. రైతుల కలను సాకారం చేశారా? అంటే లేదనే ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్ రైతులు అధికంగా పసుపును సాగుచేస్తారు. ఆ పంటకు మద్దతు ధరను కూడా కవిత కల్పించలేకపోయారని అప్పట్లోనే విమర్శలొచ్చాయి. పదేండ్లు కవితకు గుర్తుకురాని ప్రజలు ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నారు? అధికారం లేదనే కదా? బీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెను వెళ్లగొట్టింది? ఇప్పుడు ఆమె పోరాటం దేనికి? నిజంగా ప్రజల కోసమే అయితే తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు హామీలన్నీ నేరవేర్చలేదు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
కవిత కొత్త పార్టీ పెడితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు ఏమైనా నష్టం కలుగుతుందా? అంటే లేదనే సమాధానాలు వినిపిస్తున్నాయి.గతంలో చాలా మందే కొత్త పార్టీలు పెట్టారు. ఉమ్మడి ఏపీలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎంత కాలం నడిపించారు?, ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ సైతం లోక్‌సత్తా పెట్టారు? చిన్నచితకా తోక పార్టీలు కూడా వచ్చాయి కాలగర్భంలో కలిసిపోయాయి. చిరంజీవి లాంటి వ్యక్తే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. అంత పెద్ద సెలబ్రిటీ వల్లే కాలేదు.. కవితతో ఏం అవుతుంది? అని కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. ఒకవేళ ఆమె పార్టీ స్థాపించినా తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్పా.. ఆమెకు రాజకీయ భవిష్యత్ ఉండదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కవిత పార్టీ ప్రకటనపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా స్పందిస్తూ.. రాష్ట్రంలో కొత్త పార్టీకి స్పేస్ లేదని.. పెద్ద పెద్ద వారితోనే కాలేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
Jagan Vs Chandrababu: ఈసారి ఏపీ వంతు.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం, మళ్లీ అవే మాటలు
ఇదిలాఉండగా, కవిత పార్టీ వలన అధికార పార్టీకి పెద్దగా నష్టమేమీ లేదని.. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు మాత్రం ముప్పుతప్పదని టాక్ వినిపిస్తున్నది. ఎందుకంటే ఆమె తనకు జరిగిన ద్రోహాన్ని, పార్టీ నుంచి తనను వెళ్లగొట్టిన విధానం, బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలు, ఫొన్ ట్యాపింగ్ వంటి అంశాలను మీడియా ముఖంగా ఆమె బహిర్గతం చేస్తున్నారు. తద్వారా తెలంగాణ సమాజానికి గులాబీ పార్టీ మీద ఒక చెడు అభిప్రాయం ఏర్పడక మానదు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవ్వచ్చు. ఓట్ల కోసం వెళ్లినప్పుడు ఈ విషయాలను వారు ప్రశ్నించే ఆస్కారం లేకపోలేదు. లేదా ఓటు ద్వారా అయినా వారు సమాధానం చెప్పవచ్చు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలను ఎండగడతానని ఇదివరకే ప్రకటించారు. ముఖ్యంగా హరీశ్ రావు, కేటీఆర్‌ను ఆమె టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యమకారుల సాయంతో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడానకే ఆమె సంకల్పించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.