Rains Effect: తెలంగాణలో రెండవ అతిపెద్ద మహానగరం ఓరుగల్లు. హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా పిలుచుకుంటున్న ఓరుగల్లులో చినుకు పడితే చాలు ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి లోతట్టు కాలనీలలో దాపురించింది. నాలుగు సెంటీమీటర్ల వర్షానికే హనుమకొండలోని గోకుల్ నగర్ ప్రాంతం చెరువులా మారిపోతోంది. ఇళ్లల్లోకి వరద నీరు చేరి కట్టు బట్టలతో నగరవాసులను పరుగులు పెట్టిస్తోంది. ఇంతకీ హన్మకొండ నగరంలో ముంపు సమస్య ఎందుకు తలెత్తుతోంది.
హన్మకొండకు ఎన్నాళ్లీ వరద కష్టాలు..
హనుమకొండ నగరం నడిబొడ్డున ఉన్న గోకుల్ నగర్ ప్రాంతం చిన్నపాటి వర్షానికే ముంపునకు గురవుతోంది. శాంతినగర్, గోకుల్ నగర్, అశోక్ నగర్, శ్రీనివాస కాలనీ, విద్యానగర్ ప్రాంతాలు చెరువుల్లా మారిపోతున్నాయి. గోకుల్ నగర్ జంక్షన్ ప్రాంతానికి అదాలత్, సుబేదారి, వడ్డేపల్లి ఏరియాల నుండి వరద నీరు వచ్చి చేరుతోంది. గంటసేపు నాన్ స్టాప్ వర్షం కురిసిందంటే చాలు, ఇళ్లల్లోకి నీరు చేరి వరద బీభత్సం సృష్టిస్తోంది.
చిన్నపాటి వర్షానికే ముంపునకు గురవుతున్న గోకుల్ నగర్..
గోకుల్ నగర్ జంక్షన్ వైపు సుబేదారి, అదాలత్ ప్రాంతాల నుండి భారీగా వరద చేరుతోంది. వర్షపు నీళ్లు డ్రైనేజ్ లలోకి వెళ్లకుండా రోడ్లపై ప్రవహిస్తూ జంక్షన్ వద్దకు చేరుతోంది. డ్రైనేజ్ ల ఎత్తు పెంచడం, వర్షపు నీరు వెళ్లకుండా డ్రైన్ లపై స్లాబ్ లు వేయడంతో వరద రోడ్లపైనే పారుతోంది. ఇక వడ్డేపల్లి నుండి వచ్చే వరద స్నేహ నగర్, వికాస్ కాలనీ, అశోక కాలనీ నుండి గోకుల్ నగర్ జంక్షన్ వద్దకు చేరుతోంది. వడ్డేపల్లి నుండి వచ్చే వరదను వికాస్ నగర్ నుండి డ్రైన్ నిర్మించి నయీం నగర్ నాలాలోకి మళ్లిస్తే ముంపు సమస్య సగం తీరిపోయేది. అశోక కాలనీలో డ్రైనేజ్ వ్యవస్త సరిగా లేకపోవడం, 80 ఫీట్ల రోడ్ కు రెండు వైపులా డ్రైన్ లేకపోవడం ముంపు సమస్యకు కారణమవుతోంది.
ఇళ్ల ముందు డ్రైనేజ్ లను బ్లాక్ చేసిన ఓనర్లు
గోకుల్ నగర్ జంక్షన్ నుండి నయీంనగర్ నాలాను కలిపే డ్రైనేజ్ వైడెనింగ్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. స్మార్ట్ నిధులతో చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. డ్రైన్ వాటర్ వెళ్లేందుకు మాత్రమే ఆ నాలా సరిపోతోంది. విద్యానగర్ నుండి గోకుల్ నగర్ జంక్షన్ వరకు డ్రైనేజ్ వైడెనింగ్ పూర్తయితే వరద నీరు సాఫీగా నయీం నగర్ నాలాలోకి వెళ్లిపోయేది.
రోడ్ల పైకి వచ్చి చేరుతున్న వరద..
గోకుల్ నగర్ నుండి నయీంనగర్ నాలా వరకు 80 ఫీట్ల రోడ్డుకు కుడివైపున డ్రైనేజ్ లేకపోవడంతో గోకుల్ నగర్ కాలనీలోని ఇళ్లల్లోకి వరద నీరు చేరుతోంది. అటు వైపు నుండి వరద వెళ్లే దారి లేకపోవడం, నాలా మార్గం కబ్జాకు గురికావడంతో వరద నీళ్లు ఇళ్లల్లోనే ఆగిపోతున్నాయి. హనుమకొండ నగరంలో 10 సెంటీ మీటర్ల వర్షం కురిసినా… అడ్డంకులు లేకుండా వరద నయీం నగర్ నాలా లోకి చేరితే ఎక్కడా ముంపు సమస్య ఉండేది కాదు. అంతర్గత డ్రైనేజ్ వ్యవస్త సరిగా లేకపోవడమే గోకుల్ నగర్ ముంపుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
Also Read: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..
సో ఓవరాల్ గా హన్మకొండకు ఉన్న ప్రధాన నాలా నయీంనగర్. కానీ ఆ నాలా వరకు కాలనీల నుంచి వచ్చే వరద వెళ్లడం లేదు. దాంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. దీనిపై అధికారులు దృష్టిసారిస్తే భవిష్యత్ లో గోకుల్ నగర్ ఏరియా మరోసారి నీటమునగదు.