Hyderabad News: స్థానిక సంస్థల ఎన్నికల గంట మోగడంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించు కుంటున్నారు. తెలంగాణ ఏర్పాటు మొదలు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెల్లిందన్నారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్. తాము హామీ ఇస్తే అమలు చేస్తామని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోల్పోతామని బీజేపీ, బీఆర్ఎస్‌లు ఒకటే పల్లవి పాడటాన్ని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. బాకీ కార్డు అంటే నవ్వుకుంటున్నారని, రాష్ట్రాన్ని బాకీ పడేలా చేసింది ముమ్మాటికీ కేసీఆర్ అని కుండబద్దలు కొట్టారు. మంగళవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రానికి 8 లక్షల బాకీ చేసిన ఘనుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. కేవలం 11 నెలల్లో 60 వేల ఉద్యోగాలు ఇవ్వడం బాకీ పడ్డట్టా? అంటూ ప్రశ్నించారు. బాకీ మీరు చేస్తే.. వడ్డీ తాము కడుతున్నామని అన్నారు. మీకు చేరిన 8 లక్షల కోట్లకు 80 వేల కోట్లు వడ్డీలు కడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ని విమర్శించే అర్హత ఆ రెండు పార్టీలకు లేవన్నారు.
పథకాలు తమను గెలిపిస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోపై బీఆర్ఎస్-బీజేపీ నాయకులు కోర్టుకు వెళ్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వం ఇచ్చిన జీవోను స్వాగతిస్తే, ఎంపీ ఈటెల రాజేందర్ ఎందుకు స్వాగతించడం లేదని ప్రశ్నించారు.
ALSO READ: దసరా వేళ దారుణం.. ఆ ఊరిలో బతుకమ్మ వేడుకలకు బ్రేక్
బీసీ బిడ్డనని ఈటెల రాజేందర్ చెబుతుంటారని, ముదిరాజ్ బిడ్డగా కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి చేయలేదన్నారు. ఈటెల ఎందుకు అడగడం లేదు? మీరు ఎదగడానికి బీసీ నినాదం ఎత్తుకున్నారని అన్నారు. బీసీల కోసం మీరు ఎందుకు ప్రయత్నం చేయరని ప్రశ్నించారు. ఎన్నికలకు కోర్టు అవకాశం ఇస్తుందని అనుకుంటున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు టీపీసీసీ.
హైడ్రా రావడం అవసరమని ఆనాడే చెప్పామని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా హైడ్రా అవసరమని పునరుద్ఘాటించారు. కబ్జాకు గురైన భూములను రక్షించడమే ప్రభుత్వ నిర్ణయమన్నారు. రీసెంట్‌గా హైదరాబాద్ కురిసిన భారీ వర్షాలకు ఆదిత్య వెంచర్ నిర్మాణాలు మునకపై నోరెత్తారు. నదికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తోందని, ఆ నిర్మాణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతామన్నారు.
ఏమైనా లోపాలుంటే హైడ్రాకు చూచిస్తామన్నారు. గుజరాత్‌లోని సబర్మతి నది సుందరీకరణ విషయంలో నష్టపోయిన వాళ్ళకు ఇంకా పునరావాసం కల్పించలేదని ఆరోపించారు. ఫార్ములా ఈ-రేసులో దోచుకున్న వ్యక్తి కేటీఆర్ అని, తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత తమదేనన్నారు.
కేటీఆర్‌ని ప్రజలు తరిమి కొడతారన్నారు. ఎరువులు రాకుండా అడ్డుకున్నదెవరు? ఈ విషయంలో బీజేపీ-బీఆర్ఎస్‌లు కుట్ర చేశాయని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. అలాగే జూబ్లిహిల్స్ బైపోల్‌లో తమదే విజయమన్నారు.
తెలంగాణ ఏర్పాటు, హామీలు నెరవేర్చడం, బీసీ రిజర్వేషన్లు.. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందనడానికి నిదర్శనాలు
– టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ pic.twitter.com/IvogWFBsjB
— BIG TV Breaking News (@bigtvtelugu) September 30, 2025