Rain Alert: తెలంగాణలో నిన్నటి నుంచి వాతావరణ కొంచెం పొడిగా ఉంది. రోడ్లపై ఇప్పుడిప్పుడే నీరు తగ్గుతుంది. పండుగ వేళ ఊర్లోళ్లకి వెళ్లే వారికి కాస్త వాతావరణం సహకరించింది. కానీ దీంతో అప్పుడే ఆనందపడకండి .. తెలుగు రాష్ట్రాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
మరో అల్పపీడనం.. దంచికొడుతున్న వర్షాలు..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. కాగా నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21.0 డిగ్రీలు, గాలిలో తేమ 62 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఈ ప్రాంతాలకు అలర్ట్..
వాతావరణ అధికారులు తెలంగాణకు మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. నేడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. బయటకు వెళ్లేవారు.. ఊర్లళ్లకి వెళ్ళేవారు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్, హైదరాబాద్, వనపర్తి, మహబూబ్‌నగర్, మెదక్, సిద్దిపేట, సూర్యపేట, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తున్నారు.
ఏపీలో వాతావరణం ఇలా..
వాయుగుండం ప్రభావంతో ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించారు. ఈ క్రమంలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, కర్నూల్, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పార్వతీపురం, నంద్యాల, అనంతపురం, గోదావరి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అలాగే మిగత జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పలు జాగ్రత్తలు..
వర్షాల సమయంలో వాగులు, చెరువలు, కాల్వల వద్దకు వెళ్లరాదని.. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్య కారులు మరో రెండు రోజులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అలాగే విద్యుత్ లైన్లు, చెట్లు విరిగే అవకాశమున్న ప్రాంతాల్లో ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు.