Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ పూల పండగ సందర్భంగా ఊరూ వాడా బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తుతోంది. ఇదంతా ఒకవైపు అయితే ఆ ప్రాంతంలో మాత్రం ఆడబిడ్డలకు ఘోర అవమానం ఎదురైంది. మళ్లీ తెలంగాణలో దొరతనం పురుడు పోసుకుంటుందా అనే తీరులో ఈ ఘటన ఉంది. ఒకప్పుడు బాంచెన్ దొర.. కాళ్లు మొక్కుతా అనే సంఘటన గుర్తుచేస్తోంది అంటున్నారు ఈ ఘటనలో బాధితులు.
దళితులని బతుకమ్మ ఆడనివ్వని ఊరి పెద్దలు
వెనకట దొరలు, దేశ్‌ముఖ్‌ల గడీల ముందు బతుకమ్మలను పెట్టించి ఆడబిడ్డలను అరిగోసలు పెట్టిన దుష్ట సంస్కృతి ఇప్పటికీ కొందరు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. YES ఇప్పుడు కూడా అదే తీరుగా మళ్లీ అలాంటి పెత్తనమే చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. బతుకమ్మ ఆడనివ్వకుండా జాతి వివక్షతో మహిళలను అవమానిస్తున్నారనే విధంగా ఉన్నాయి కొన్ని పరిస్థితులు. తెలంగాణ అంతటా బహుజన బతుకమ్మ పేరుతో సంబురాలు జరుపుకుంటుంటే… మంచిర్యాల జిల్లాలో మాత్రం మహిళలు కన్నీళ్లు పెటుకున్న ఇన్సిడెంట్ ఇప్పుడు అందరిని కాస్త కలవరపెడుతోంది.
ఆలయానికి తాళం వేసిన గ్రామ పెద్దలు
మంచిర్యాల జిల్లా మందమర్రిలో దళిత మహిళలకు ఘోర అవమానం జరిగింది. మందమర్రిలో సద్దుల బతుకమ్మ వేడుకలను కోదండ రామాలయం ప్రాంగణంలో నిర్వహించవద్దని ఆలయం గేటుకు తాళం వేశారు మందమర్రి ఊరు పెద్దలు. కేవలం దళితులు అనే ఒక్క కారణంతోనే ఆలయానికి రాకుండా అడ్డుకున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తొమ్మిది రోజుల నుంచి ఇదే పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. దేవుని గుడిలో బతుకమ్మ ఆడొద్దు అంటే తాము ఎక్కడికి వెళ్లి ఆడుకోవాలని కన్నీరు పెట్టుకుంటున్నారు వారంతా.
ఈ కాలంలో కూడా ఇలాంటి చిన్నచూపు ఏంటి?
తెలంగాణ సాయుధ పోరాటం, తొలి దశ, మలి దశ పోరాటాల తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మన పండుగలు, మన సంస్కృతి, మన భాష అంటూ సంబురంగా ముందుకెళ్తోంది మన తెలంగాణ. అలాంటి ఆడబిడ్డల పండుగ రోజే వారిని తక్కువ చేసి చూడటం అనేది నిజంగా సిగ్గు పడాల్సిన ఘటన. దళితులు అనే ఒకే ఒక్క కారణంతో దేవుడి ఆవరణలో బతుకమ్మ ఆడుకోవడాన్ని అడ్డుకోవడం అనేది అమానుషం.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనం బోల్తా.. 15 మంది…!
ఇప్పటికైనా మనుషులు మారాలి.. కులమత బేధాలు తగ్గించాలి..
కాలం మారింది.. టెక్నాలజీ పెరిగింది.. కానీ ఇవేవీ కూడా మనుషుల మధ్య అంతరాలను తగ్గించలేకపోయింది అనే దానికి ఉదాహారణే ఈ ఘటన. ఇంకా దళితులు, చిన్న కులాలు అంటూ మనుషులు దూరంగా పెడుతున్నామంటే.. దీని కంటే అరాచకం మరొకటి ఉండదు. ఇప్పటికైనా మనుషులు మారాలి.. వారి మనసుల్లో ఉన్న ఇలాంటి మురికి ఇప్పటికైనా తొలిగిపోవాలని కోరుకుందాం.