
బిడ్డలు ఆపదలో ఉంటే ఏ కన్నతల్లైనా అలా చూస్తుండిపోదు. అది ఎలాంటి కష్టమైనా, ఆపదైనా సరే.. వారిని రక్షించేందుకు తన సర్వశక్తులూ ఒడ్డుతుంది. అందులోనూ ఆడపిల్లలపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే.. అపరకాళిలా విరుచుకుపడుతుంది. కానీ.. కేరళలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించిందో తల్లి. తన మైనర్ కూతుర్లను పదే పదే ప్రియుడి ఇంటికి తీసుకెళ్లి.. లైంగిక వేధింపులకు సహకరించింది. 2018-19 సంవత్సరాల్లో జరిగిన ఈ దారుణంపై.. కేరళ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. కూతుర్ల పట్ల అంత అమానుషంగా వ్యవహరించిన ఆ తల్లికి 40 ఏళ్లు జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురం పట్టణానికి చెందిన మహిళ భర్త మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాంతో పిల్లలతో కలిసి ఆమె విడిగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో శిశుపాలన్ అనే వ్యక్తితో సదరు మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. తరచుగా అతని ఇంటికి వెళ్లొచ్చేది. మహిళపై మోజు తీర్చుకున్న అతడు.. ఆ తర్వాత ఆమె కూతుర్లపై కన్నేశాడు. వాళ్లను కూడా ఇంటికి తీసుకురావాలని ఒత్తిడి చేయగా.. అడ్డు చెప్పాల్సిందిపోయి.. కూతుర్లను అతనికి బానిసలను చేసింది.
తన కళ్లముందే కూతుర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే.. ఒక్కనాడైనా ఆపిన పాపానపోలేదు. తల్లిప్రవర్తన, శిశుపాలన్ వేధింపులు భరించలేక పిల్లలు నానమ్మ ఇంటికి పారిపోయారు. వారు చెప్పిందంతా విని హతాశురాలైన ఆమె.. మనవరాళ్లను పిల్లల సంరక్షణ కేంద్రంలో చేర్చింది. అక్కడ కౌన్సెలింగ్ లో అసలేం జరిగిందో.. పూర్తిగా చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లి, ఆమె ప్రియుడైన శిశుపాలన్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసు విచారణలో ఉండగానే శిశుపాలన్ ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా ఆ కర్కశ తల్లికి కోర్టు 40 ఏళ్లు జైలుశిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఇలాంటి తల్లి మాతృత్వం అనే మాటకే తలవంపులు తెచ్చిందని, ఆమె చేసిన నేరం క్షమార్హం కాదని న్యాయమూర్తి ఆర్. రేఖ అభిప్రాయపడ్డారు.