South Central Railway: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ కోసం ప్రజలంతా సొంతూళ్లకు చేరుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ ఈ పండుగ జరుపుకుంటారు. ఇంటి లోగిళ్లలో అందమైన ముగ్గులు, ముగ్గుల్లో గొబ్బిమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడిపందాలతో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తారు. కొత్త అల్లుళ్లకు అత్తారిళ్లలో చేసే మర్యాదలు మామూలుగా ఉండవు. ఈ పండుగ కోసం ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వెళ్లిన వాళ్లంతా స్వగ్రామాలు తరలి వస్తారు. హైదరాబాద్ లాంటి నగరాలు మూడు రోజుల పాటు ఖాళీ అవుతాయి.
మరో 26 అదనపు రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
ఇక సంక్రాంతి పండుగకు పెద్ద సంఖ్యలో జనాలు సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే పలు రైళ్లను ప్రకటించి అధికారులు, తాజాగా మరో 26 అదనపు రైళ్లను షెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు. ఇవాళ్టి (జనవరి 10) నుంచి ఈ నెల 17 వరకు ఈ రైళ్లను నడుపనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్-అర్సికిరే, విశాఖపట్నం-చర్లపల్లి, బెంగళూరు-కాలబురిగి మధ్య ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయన్నారు.
ప్రత్యేక రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?
చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ఈ నెల 11, 12, 13, 16,17, 18 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇందులో జన్ సాధారణ్ అంటే అన్నీ జనరల్ బోగీలతో కూడిన రైల్లు ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అటు విశాఖ-చర్లపల్లి నడుమ 10,11, 12,15,16,17 నడుస్తాయన్నారు. ఇక ఈ అదనపు రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడలో హాల్టింగ్ తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లకు ముందస్తు బుకింగ్ అనేది ఉండదని అధికారులు తెలిపారు. అప్పటికప్పుడు స్టేషన్ లో టికెట్ తీసుకుని ఎక్కే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
26 Additional #Sankranti Special Trains between various Destinations pic.twitter.com/fjMAKhIn12
— South Central Railway (@SCRailwayIndia) January 9, 2025
సంక్రాతి కోసం 6,432 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో 6,432 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ బస్సులు ఈ నెల 10,11,12 తేదీల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. తిరుగు ప్రయాణం చేసే వారి కోసం ఈ నెల 19, 20 తేదీల్లోనూ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్ పల్లి, గచ్చిబౌలి నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆయన తెలిపారు. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలు ఉంటాయని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందన్నారు. ఇక సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 040-69440000,040-23450033 నంబర్లకు కాల్ చేసిన కావాల్సిన సమాచారం పొందే అవకాశం ఉందన్నారు.
Read Also: ఓడియమ్మ.. ఈ ఒక్క రైలు సంపాదనే అన్నికోట్లా? ఇది ఏ రూట్‌లో వెళ్తుందంటే…?