India’s Highest Earning Trains: భారతీయ రైల్వే సంస్థ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా గుర్తింపు తెచ్చుకుంది. సుమారు లక్ష కిలో మీటర్ల రైల్వే లైన్లను కలిగి ఉంది. దేశంలో పౌర రవాణా, సరుకు రవాణాలో రైల్వే కీలకపాత్ర పోషిస్తున్నది. ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా వేలాది రైళ్లు తమ సర్వీసులను కొనసాగిస్తున్నాయి. కోట్లాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. మెయిల్ ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, లోకల్, రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్ ప్రెస్ తో పాటు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రజలకు సేవలను అందిస్తున్నాయి.
రెండు విధాలుగా రైల్వేకు ఆదాయం
భారతీయ రైల్వే సంస్థ రెండు విధాలుగా ఆదాయాన్ని పొందుతున్నది. వాటిలో ఒకటి సరుకు రవాణా ద్వారా కాగా, మరొకటి ప్రజలను గమ్యస్థానాలను చేర్చడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నది. సరకు రవాణాతో పోల్చితే టికెట్ల విక్రయం ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతుంది. అదే సమయంలో ప్రయాణీకులకు సంబంధించిన ప్రతి టికెట్ మీద 46 శాతం సబ్సిడీ అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ప్రతి సంవత్సరం రూ. 56,993 కోట్లు ఖర్చు చేస్తున్నది.
ఎక్కువ ఆదాయాన్ని పొందిన రైలు ఇదే!
దేశ వ్యాప్తంగా నిత్యం 13 వేల రైళ్లు తమ రాకపోకలను కొనసాగిస్తున్నాయి. వీటిలో ఓ రైలు దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని పొందింది.ఆ రైలు మరేదో కాదు KSR బెంగళూరు రాజధాని ఎక్స్ ప్రెస్. ఉత్తర రైల్వేకు చెందిన ఈ రైలు ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ -KSR బెంగళూరు సిటీ జంక్షన్ వరకు నడుస్తున్నది. ఈ ఎక్స్ ప్రెస్ రైలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 1,76,06,66,339 ఆదాయాన్ని ఆర్జించింది. సదరు ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ రైల్లో 5,09,510 మంది ప్రయాణించినట్లు ఇండియన్ రైల్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Read Also: జమ్మూకాశ్మీర్ కోసం సరికొత్త వందేభారత్, ఈ రైల్లో స్పెషల్ ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
దేశంలో అత్యధిక ఆదాయం సంపాదించిన ఇతర రైళ్లు
⦿ భారతీయ రైల్వే సంస్థకు అత్యధికంగా ఆదాయాన్ని సంపాదిస్తున్న రైళ్లలో సీల్దా రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఒకటి. ఇది న్యూఢిల్లీ- కోల్‌కతా మధ్య నడుస్తుంది. సీల్దా రాజధాని ఎక్స్ ప్రెస్ లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5,09,164 మంది ప్రయాణించారు. రూ. 1,28,81,69,274 ఆదాయాన్ని సంపాదించింది.
⦿ 2022-23 ఆర్థిక సంవత్సరంలో న్యూఢిల్లీ- అసోంలోని దిబ్రూఘర్ మధ్య నడిచే దిబ్రూగర్ రాజధాని ఎక్స్ ప్రెస్ కూడా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదించింది. ఈ రైల్లో 4,74,605 మంది ప్రయాణించగా, రూ. 1,26,29,09,697 ఆదాయం లభించింది. దేశంలో అత్యధిక ఆదాయం పొందిన మూడో రైలుగా గుర్తింపు తెచ్చుకుంది.
⦿ ముంబై తేజస్ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు అత్యధిక ఆదాయాన్ని సాధిస్తున్న నాలుగో రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు న్యూఢిల్లీ-ముంబై సెంట్రల్ వరకు తన సర్వీసులను కొనసాగిస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4,85,794 మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చిన ఈ రైలు రూ.122 కోట్లను ఆర్జించింది.
Read Also: రైల్వే జోన్.. అవన్నీ సాధ్యమే ఇక, ఇంకా ఏయే ప్రయోజనాలు లభిస్తాయో తెలుసా?