India: ఎట్టకేలకు భారత్ -పాకిస్తాన్ మధ్య నెలకున్న ఉద్రిక్తతలకు ఫుల్‌స్టాప్ పడింది. గడిచిన ఐదురోజులుగా మూతబడిన 32 ఎయిర్‌పోర్టులు తిరిగి తెరచుకోనున్నాయి. దీనికి సంబంధించి పౌర విమానయాన శాఖ నోటమ్ జారీ చేసింది. ఈ క్రమంలో విమాన సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి.
32 ఎయిర్ పోర్టులు పునఃప్రారంభం
పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య టెన్షన్ నెలకొంది. దాయాది దేశం దూకుడు ప్రదర్శించడంతో గడిచిన ఐదురోజులుగా 32 విమానాశ్రయాలను మూసివేసింది కేంద్రప్రభుత్వం. ఉత్తరాదితోపాటు పశ్చిమ ప్రాంతంలోని కొన్ని నగరాల్లో పలు ఎయిర్‌పోర్టులు మూతబడ్డాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో మే 15 వరకు పౌర విమాన కార్యకలాపాలకు మూసివేసినట్లు మే 9న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-DGCA ప్రకటించింది.
ప్రస్తుతం ఇరుదేశాల మధ్య వాతావరణ ప్రశాంతంగా ఉండడంతో వాటిని రీఓపెన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది కేంద్ర పౌర విమానయాన శాఖ. విమాన కార్యకలాపాలను పునరుద్ధరిస్తూ సంబంధిత అధికారులు ఈ మేరకు నోటమ్ జారీ చేశారు. నోటీస్ టు ఎయిర్‌మెన్ పేరిట విడుదల చేసింది. నోటామ్ జారీ కావడంతో విమానాల రాకపోకలకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని పైలట్లకు, ఇతర సిబ్బందికి అధికారికంగా తెలియజేశారు. విమానయాన కార్యకలాపాలు సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది.
తిరిగి తెరవబడే విమానాశ్రయాలలో ఇవి ఉన్నాయి. చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లూధియానా, భుంటార్, కిషన్‌గఢ్, పాటియాలా, సిమ్లా, కాంగ్రా-గగ్గల్, భటిండా, జైసల్మేర్, జోధ్‌పూర్, బికనీర్, హల్వారా, పఠాన్‌కోట్, జమ్మూ, లేహ్, ముంద్రా, జామ్‌నగర్, హిరాసర్, పోర్బందర్, కేశోడ్, కాండ్లా, భుజ్, అదమ్‌పూర్, లుథియానా, నలియా, రాజ్‌కోట్ తోపాటు మరి కొన్ని ఇందులో ఉన్నాయి.
ALSO READ: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం
ఉత్తర్వులు వెలువడిన వెంటనే చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి సోమవారం ఉదయం 10 గంటల నుండి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఎయిర్‌పోర్టులు పునఃప్రారంభంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నాయి. నిలిచిపోయిన సర్వీసులు ఒక్కొక్కటిగా ప్రారంభం కానున్నాయి.
ఆదివారం రాత్రి వరకు పరిశీలన
దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో అధికారులు సరిహద్దుల పరిస్థితిని నిశితంగా పరిశీలించారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత విమానాశ్రయాలను తిరిగి తెరిచేందుకు అనుమతించినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి 32 ఎయిర్‌పోర్టుల విమాన సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు అధికారులు.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హజ్ ఈ విషయమై ఆదివారం ఎక్స్ వేదికగా కేంద్రాన్ని కోరారు. హజ్ యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాలను తెరవాలన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
దీనితోడు కాల్పుల విరమణకు అంగీకారానికి వచ్చిన తర్వాత జమ్మూకాశ్మీర్‌లోని ఎయిర్ స్థావరాలపైకి దాయాది దేశం డ్రోన్ల పంపింది. దీన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం, వైమానిక విభాగం కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తలేదు. పరిస్థితి గమనించిన పౌరవిమానయాన శాఖ ప్రకటన ఇచ్చిందని అంటున్నారు.