Vizag Metro Rail Video 2035: ఏపీ కీలక నగరాల్లో ఒకటైన విశాఖపట్నం సమగ్ర అభివృద్ధిపై చంద్రబాబు సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. అమరావతితో పాటు వైజాగ్ లో అత్యాధునిక మెట్రో వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధిచి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు గ్రాఫిక్ డిజైనర్లు మెట్రో పూర్తి అయ్యాక, ఇంకా చెప్పాలంటే.. 2035లో విశాఖపట్నం ఎలా ఉంటుంది? అనే ఆలోచన చేశారు. అందుకు అనుగుణంగా గ్రాఫిక్స్ లో ఫ్యూచర్ సిటీని చూపించే ప్రయత్నం చేశారు. “మహా నగరాన్ని మెట్రో అల్లుకుంటుందని ఎప్పుడైనా ఊహించారా? కానీ, నిజం కాబోతోంది. ఇప్పుడు మేం గ్రాఫిక్స్ ఉపయోగించి మెట్రో సిటీ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశాం. ఇది నిజం కాదు. కానీ, ఇలా ఉండవచ్చు అనుకుంటున్నాం. మీకు ఎలా అనిపించిందో చెప్పండి” అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ వీడియో గాజువాక నుంచి మెట్రో పరుగు మొదలవుతుంది. నెమ్మదిగా NDA జంక్షన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి మద్దెలపాలెం.. ఆ తర్వాత మధువాడ మీదుగా మెట్రో ప్రయాణిస్తున్నట్లు చూపించారు. మొత్తంగా వైజాగ్ ను చుట్టేసే ఈ మెట్రో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విశాఖ మెట్రో గురించి..
విశాఖపట్నంలో ఏపీ ప్రభుత్వం మెట్రో వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. విశాఖలో మొత్తం మూడు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం జరగనుంది. ఇందులో మొదటి కారిడార్ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది కూడలి వరకు 34.4 కి.మీ మేర నిర్మిస్తారు. రెండో కారిడార్ గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5.07 కి.మీ నిర్మాణం జరుపుకోనుంది. మూడో కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.75 కి.మీ. మేర నిర్మాణం జరుగుతుంది. ఫేజ్ 1లో భాగంగా మొత్తం 46.23 కి.మీ. దూరాన్ని కవర్ చేసేలా నిర్మిస్తున్నారు. ఫేజ్ 1కు సంబంధించిన నిర్మాణ పనులు అక్టోబర్ 2025 నుంచి మొదలవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ దశను రెండు భాగాలుగా విభజించారు. 20 కి.మీ. డబుల్ డెక్కర్ మెట్రో వ్యవస్థతో పాటు 26 కి.మీ. ప్రామాణిక మెట్రో కారిడార్ ను నిర్మించనున్నారు.
Read Also: కాజీపేటలో మెట్రో రైళ్ల తయారీ, రైల్వే మంత్రి కీలక ప్రకటన!
రూ. 11 వేల కోట్ల అంచనా వ్యవయంతో నిర్మాణం
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం రూ.11,498 కోట్ల అంచనాతో చేపట్టాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఇందులో రూ.6,100 కోట్లు రుణం అవసరం అవుతుందని అధికారులు వెల్లడించారు. పీపీపీ విధానంలో ప్రైవేటు బ్యాంకులు రూ.6,100 కోట్లు నిధులు అందిస్తే, మిగిలిన మొత్తం రూ.5,398 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 16,000 మంది ప్రయాణీకులు సులభంగా తమ గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖలో ట్రాఫిక్ సమస్య తగ్గి, నగర అభివృద్ధికి మేలు కలిగే అవకాశం ఉందంటున్నారు.
Read Also: 17 రోజులు, 30 ప్రదేశాలు.. రామాయణయాత్రకు వెళ్దాం రండి!