Secunderabad Railway Station New Look: శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా.. సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్ ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక.. సాధారణ రైల్వే స్టేషన్ లా కాకుండా, ఎయిర్ పోర్ట్ తరహాలో కనిపించనుంది. డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తై ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్టుకు మించిన డిజైన్ తో ఆకట్టుకుంటుంది. విశాలమైన ఎంట్రెన్స్ లు, సౌకర్యవంతమైన వాతావరణం ప్రయాణికులకు కొత్త అనుభవాన్ని అందించనున్నాయి. స్టేషన్ లో రద్దీని తగ్గించేలా, ప్రయాణికులు సులభంగా వెళ్లడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో రెండంచెల ఎయిర్ కాంకోర్స్ నిర్మిస్తున్నారు. దీని వల్ల ప్రయాణికులు పై అంతస్తులో నుంచి ప్లాట్ ఫారమ్ లకు సులభంగా చేరుకుంటారు. ఈ వ్యవస్థ వల్ల జనాల రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. పెద్ద నగరాల్లోని ఎయిర్ పోర్ట్ లలో ఉండే విధంగా సౌకర్యవంతమైన మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్ లో ఫుడ్ కోర్ట్స్, రిటైల్ షాప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు రైలు కోసం వేచి ఉండే సమయంలో భోజనం చేయడం, షాపింగ్ చేయడం సులభమవుతుంది. కుటుంబాలతో ప్రయాణించే వారికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మరో కీలకమైన సదుపాయం మెట్రో కనెక్టివిటీ. మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ కు నేరుగా వెళ్లే స్కైవాక్ నిర్మిస్తున్నారు. దీని వల్ల ట్రాఫిక్ లో చిక్కుకోకుండా, నేరుగా మెట్రో నుంచి స్టేషన్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. నగర ప్రయాణం మరింత సులభంగా మారుతుంది. అంతేకాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టేషన్ లో సోలార్ పవర్ వినియోగం, ఎలక్ట్రిక్ వాహనాల కోసం EV ఛార్జింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రీన్ ఫీచర్స్ వల్ల పర్యావరణానికి మేలు జరిగే అవకాశం ఉంటుంది.
Read Also: 1866 నుంచి ఆగని ప్రయాణం.. దేశంలో అత్యంత పాత రైలు ఇదే!
ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పూర్తయ్యాక, సికింద్రాబాద్ స్టేషన్ కేవలం రైల్వే స్టేషన్‌గా కాకుండా, పెద్ద ట్రాన్స్ పోర్ట్ హబ్ గా మారనుంది. రైలు, మెట్రో, బస్సు లాంటి రవాణా సౌకర్యాలు ఒకేచోట లభించడం వల్ల ప్రయాణికులకు చాలా సౌలభ్యం కలుగుతుంది. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ సిటీ రవాణా వ్యవస్థలో పెద్ద మార్పును తీసుకురానుంది. ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, వేగంగా, స్మార్ట్ గా మారనుంది.
Read Also: రైలు సీటు దగ్గరికే ఫుడ్ డెలివరీ.. ixigo, Swiggy కొత్త సర్వీస్ షురూ!