Amarnath Yatra: కఠినమైన కొండకోనలు, ఒళ్ళు గగుర్పొడిచే చలి, సముద్ర మట్టానికి సుమారు 3,888 మీటర్ల ఎత్తు… ఇవేవీ శివభక్తుల తలపులను అడ్డుకోలేవు. ప్రతి ఏటా కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది జూలై 3 నుంచి ప్రారంభం కానున్న ఈ ఆధ్యాత్మిక ప్రయాణం, ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినంతో ముగియనుంది. మొత్తం 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గుహలోని మంచు లింగానికి తొలి పూజలు నిర్వహించి, యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. భక్తుల రక్షణ కోసం సైన్యం, పోలీసులు, వాలంటీర్లు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రకృతి ప్రసాదించిన పరమాద్భుతం..
అమర్‌నాథ్ గుహలో కొలువై ఉన్న శివలింగం మానవ నిర్మితం కాదు, అది ప్రకృతి సిద్ధంగా మంచుతో ఏర్పడే ఒక అద్భుతం. గుహ పైకప్పు నుంచి పడే నీటి చుక్కలు గడ్డకట్టి మంచు లింగంగా మారుతాయి. ఇక్కడి విశేషం ఏమిటంటే.. చంద్రుని కళలను బట్టి (అమావాస్య నుంచి పౌర్ణమి వరకు) ఈ శివలింగం పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. శ్రావణ పౌర్ణమి నాటికి ఈ లింగం పూర్తి పరిమాణాన్ని సంతరించుకుంటుంది. ఈ గుహలోనే పార్వతీ దేవి, వినాయకుడికి ప్రతీకలుగా భావించే మరో రెండు చిన్న మంచు లింగాలు కూడా ఏర్పడటం గమనార్హం.
అమరనాథ్ నామకరణం వెనుక రహస్యం..
పురాణాల ప్రకారం, ఈ పవిత్ర గుహకు అమర్‌నాథ్ అనే పేరు రావడం వెనుక ఒక అద్భుతమైన గాథ ఉంది. ఒకసారి పార్వతీ దేవి పరమశివుడిని అమరత్వానికి గల రహస్యాన్ని చెప్పమని కోరుతుంది. ఆ సృష్టి రహస్యాన్ని ఎవరూ వినకూడదనే ఉద్దేశంతో, శివుడు అత్యంత ఏకాంతంగా ఉండే ఈ హిమాలయ గుహను ఎంచుకున్నాడు. ఈ రహస్య ప్రయాణంలో శివుడు తన వాహనమైన నందిని ‘పహల్గామ్’ వద్ద, చంద్రుడిని ‘చందన్‌వాడి’ వద్ద, ఒంటిపై ఉన్న పాములను ‘శేష్‌నాగ్’ వద్ద వదిలిపెట్టాడు. అందుకే ఆయా ప్రదేశాలకు ఇప్పటికీ అవే పేర్లు ఉన్నాయి.
పావురాల జంట వెనుక ఉన్న ఆసక్తికర కథనం..
రహస్య గుహకు చేరుకున్న తర్వాత, శివుడు అమరకథను పార్వతికి వినిపించడం ప్రారంభించాడు. కథ వింటూ పార్వతీ దేవి నిద్రలోకి జారుకున్నప్పటికీ.. అక్కడ ఉన్న ఒక జంట పావురాలు ఆ కథను పూర్తిగా విన్నాయి. అమరకథను వినడం వల్ల ఆ పావురాలకు అమరత్వం లభించింది. నేటికీ ఈ కఠినమైన మంచు గుహలో, అంతటి చలిలో కూడా భక్తులకు ఒక జంట పావురాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ పావురాలను దర్శించుకుంటే సాక్షాత్తూ శివపార్వతులను దర్శించుకున్నట్లేనని భక్తుల నమ్మకం.
యాత్రకు వెళ్లే భక్తులకు ముఖ్య సమాచారం
ఈ కఠినమైన యాత్రకు ఏప్రిల్ 15 నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్ బ్యాంక్, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్‌లకు చెందిన 554 శాఖల్లో భక్తులు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే, అత్యంత కఠినమైన వాతావరణం, ఆక్సిజన్ కొరత ఉండే ఈ ప్రాంతానికి వెళ్లడానికి అమర్‌నాథ్ బోర్డు కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది. బోర్డు రూల్స్ ప్రకారం.. 13 ఏళ్ల లోపు వయసున్న పిల్లలను, 70 ఏళ్లు పైబడిన వృద్ధులను, అలాగే ఆరు నెలలకు పైగా గర్భంతో ఉన్న మహిళలను ఈ యాత్రకు అనుమతించరు.
మొత్తంగా “హర హర మహాదేవ” అనే నామస్మరణతో హిమాలయాల్లో సాగే ఈ ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తుంది.
Also Read: విద్యార్థులకు తీపి కబురు.. ఇకపై ప్రతి నెలా రూ.250 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్!