Cyclone Disrupts Train Services: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాను ప్రభావంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 60కి పైగా రైళ్లను రద్దు చేయడంతో పాటు, మరో రెండు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నడిచే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లపై ఈ ప్రభావం పడింది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 4 వరకు పలు రైళ్లు రద్దు కానున్నాయి.
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, అక్టోబర్ 28 ఉదయం బాపట్ల, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్-యానాం తీరాన్ని తుఫాను దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో రైల్వే ట్రాక్‌లు, విద్యుత్ వ్యవస్థలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పలు రైళ్లను రద్దు చేయడం, కొన్ని సర్వీసులను మధ్యలోనే నిలిపివేయాలని నిర్ణయించారు.
విశాఖపట్నం నుంచి కిరండూల్ వెళ్లే నంబర్ 18515 నైట్ ఎక్స్‌ప్రెస్, తిరుగు ప్రయాణంలో నంబర్ 18516 రైళ్లను అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 వరకు రద్దు చేశారు. అలాగే, విశాఖపట్నం-కోరాపుట్ ప్యాసింజర్ (58538), కోరాపుట్-విశాఖపట్నం ప్యాసింజర్ (58537) సర్వీసులను కూడా వేర్వేరు తేదీల్లో రద్దు చేశారు. విశాఖపట్నం-కోరాపుట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18512), కోరాపుట్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18511) సర్వీసులపైనా ప్రభావం పడింది. విశాఖపట్నం-కిరండూల్ మార్గంలో నడిచే 58501, 58502 ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేసినట్లు రైల్వే ప్రకటించింది.
విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నరసాపురం, భీమవరం, నిడదవోలు, రాజమండ్రి, కాకినాడ పోర్ట్, గుంటూరు, రేపల్లె మార్గాల్లో నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేశారు. అక్టోబర్ 27, 28 తేదీల్లో ఈ మార్గాల్లో ప్రయాణించేవారు తమ రైళ్ల వివరాలను ముందుగానే చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
భువనేశ్వర్-జగదల్‌పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447) అక్టోబర్ 27 నుంచి 30 వరకు రాయగడలోనే ప్రయాణాన్ని ముగించనుంది. తిరుగు ప్రయాణంలో జగదల్‌పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18448) అక్టోబర్ 28 నుంచి 31 వరకు కోరాపుట్‌కు బదులుగా రాయగడ నుంచి బయలుదేరనుంది.
తుఫాను నేపథ్యంలో రైళ్ల రద్దు, రూట్ ఛేంజెస్ ప్రయాణ తేదీలను బట్టి మారవచ్చు. ప్రయాణానికి బయలుదేరే ముందు భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్, NTES యాప్‌లో తాజా వివరాలను తనిఖీ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. రద్దయిన రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు సంబంధిత రైల్వే నిబంధనల ప్రకారం రీఫండ్ వివరాలను తెలుసుకోవాలి.
Read Also: బుల్లెట్ రైలు ప్రయాణానికి ముహూర్తం ఖరారు.. రైల్వే మంత్రి ఏమన్నారంటే!