Shooting at Hotel: కారణాలు ఏమైనా కావచ్చు.. ఏకంగా మనుషులను కాల్చుకునే స్థాయి వరకు వెళ్లింది. అలాంటి ఘటన ఒకటి గౌహతిలో వెలుగు చూసింది. హోటల్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన వెనుక అసలు కారణమేంటి? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
అస్సాం రాజధాని గౌహతిలోని హోటల్ బిలాస్ ఇన్‌లో రాత్రి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హోటల్ లీజు ఒప్పందానికి సంబంధించిన వివాదం ఈ ఘటన వెనుక కారణంగా చెబుతున్నారు. ఘటన జరిగిన గంటలో నిందితులను అరెస్టు చేసినట్లు గౌహతి పోలీస్ కమిషనర్ పార్థ సారథి మహంత వెల్లడించారు. కాల్పుల్లో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని కమిషన్ వెల్లడించారు.
ఆస్తి కౌలుదారుడు ఘనకాంత గోగోయ్ ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఆస్తి వివాదం కారణంగా ఈ సంఘటన జరిగిందని అనుమానిస్తున్నామని తెలిపారు. విచారణ ఇంకా ప్రాథమిక దశలో ఉందని కమిషనర్ చెప్పారు. మృతులందరూ హోటల్ యజమానికి సన్నిహితులే. వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు. మరొక వ్యక్తి వారి గ్రామానికి చెందినవాడు. గాయపడిన వ్యక్తి ఆ గ్రామానికి చెందినవాడని తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను నిర్ధారించి కేసును ముగింపునకు తీసుకురావడానికి సమగ్రమైన దర్యాప్తు జరుగుతోందన్నారు కమిషనర్.
ALSO READ: సిబ్బందిపై దాడి.. తమిళనాడులో జైలు నుంచి తప్పించుకున్న 17 మంది ఖైదీలు, షాకైన అధికారులు
మృతులలో ముగ్గురు హెలెనా భరాలి, దేబోర్షి కశ్యప్, నారాయణ్ దాస్‌గా గుర్తించారు. మిగతా ఇద్దరి గుర్తింపు ధృవీకరించాల్సి వుంది. ఈ ఘటనపై అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై హిమంత బిస్వా శర్మ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ఈ ఘటన శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోందన్నారు. పెరుగుతున్న నేరాలపై శర్మ సర్కార్ మరింత దృష్టి పెట్టాలని రాసుకొచ్చారు.