Longest Gold Walkway| బంగారంతో చేసిన దారిపై నడవాలని ఊహించగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, దుబాయ్‌లో అలాంటి ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి రానుంది. దుబాయ్ ప్రభుత్వం ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యాటకులు, నగల ప్రియులను ఆకర్షించే లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన 24 క్యారెట్ల బంగారు వాక్‌వే ఏర్పాటు చేయాలని దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ భావిస్తోంది. గల్ఫ్ టుడే మీడియా నివేదిక ప్రకారం.. ఈ ప్రాజెక్టును 2026 చివరి నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆకర్షణ అందుబాటులోకి వస్తే దుబాయ్ పర్యాటక రంగానికి మరో ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంది.
దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో భాగంగా ఈ బంగారు వాక్‌వేను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. బంగారం వ్యాపారం, నగల షాపింగ్, పర్యాటక అనుభవాలను ఒకే ప్రాంతంలో అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ కమర్షియల్ విభాగం సీనియర్ డైరెక్టర్ రషీద్ అల్ హర్మౌది ప్రకారం.. ఈ వాక్‌వే రెండు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, కచ్చితమైన ప్రారంభ తేదీపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.
దుబాయ్‌లోని దేరా ప్రాంతంలో గోల్డ్ డిస్ట్రిక్ట్ ఉంది. సంప్రదాయ బంగారు మార్కెట్లకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో 2026 జనవరిలో గోల్డ్ డిస్ట్రిక్ట్‌ను ప్రారంభించారు. దుబాయ్ మీడియా ఆఫీస్ సమాచారం ప్రకారం.. ఇక్కడ వెయ్యికి పైగా రిటైల్ వ్యాపార సంస్థలు ఉన్నాయి. బంగారం, నగలు, బులియన్, పెర్ఫ్యూమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, లైఫ్‌స్టైల్ వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. హోల్‌సేల్ వ్యాపారులు, పెట్టుబడిదారులు, పర్యాటకులకు ఒకే ప్రాంతంలో అనేక సౌకర్యాలు కల్పించడం ఈ కేంద్రం లక్ష్యం.
రషీద్ అల్ హర్మౌది వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభం నుంచి కొత్త హోల్‌సేల్ బంగారం ట్రేడింగ్ ఆఫీస్‌ల సంఖ్య 20 శాతం పెరిగింది. బంగారం, నగలు, విలువైన రాళ్లు, లగ్జరీ వాచీలకు సంబంధించిన కొత్త దుకాణాల సంఖ్య కూడా 15 శాతం పెరిగింది.
రాబోయే ఏడాదిలో ఈ ప్రాంతానికి తరలివచ్చే కంపెనీల సంఖ్య 10 నుంచి 20 శాతం వరకు పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. ఇందుకోసం అదనపు కార్యాలయాలు, రిటైల్ స్థలాలను అభివృద్ధి చేస్తున్నారు.
Also Read: గోవా కంటే బెటర్.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఈ 4 ప్రదేశాలు బెస్ట్
దుబాయ్‌లో బంగారు నగలకు సంబంధించిన మరో విశేషం కూడా చోటుచేసుకుంది. జోయాలుక్కాస్ జ్యువెలరీ రూపొందించిన సంప్రదాయ ఇండియన్ ఇయర్ రింగ్స్.. రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించాయి. అత్యంత బరువైన బంగారు చెవిపోగుల పెయిర్, ప్రపంచంలోనే అతిపెద్ద చెవిపోగుల జతగా ఈ నగలు గుర్తింపు పొందాయి. ఈ ఘనత బంగారు నగల తయారీలో భారతీయుల నైపుణ్యాన్ని చాటిచెప్పింది.
Also Read: రైలు ప్రయాణంలో ఫ్యామిలీకి వేర్వేరు సీట్లు వచ్చాయా? ఇదిగో ముందుగానే ఇలా మార్చుకోండి
బంగారు వాక్‌వే ద్వారా నగల కొనుగోలుతో పాటు ప్రత్యేకమైన పర్యాటక అనుభవాన్ని అందించాలని దుబాయ్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు సందర్శకుల సంఖ్యను పెంచడంతో పాటు స్థానిక వ్యాపారాలకు కూడా ప్రయోజనం చేకూర్చవచ్చు. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తయితే, దుబాయ్‌లో మరో ప్రత్యేక పర్యాటక ఆకర్షణ అందుబాటులోకి రానుంది. అయితే, ప్రారంభ తేదీ, సందర్శకుల ప్రవేశ వివరాలపై అధికారిక ప్రకటన కోసం మరి కొంత కాలం వేచి చూడాలి.