Cyclone Aqwan Disrupts Train Services: అక్వాన్ తుఫాను ప్రభావం రైళ్ల మీద్ర తీవ్రంగా పడింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలపై తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తూర్పు, దక్షిణ రైల్వే జోన్ల పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. వీటిలో కనీసం 69 రైళ్లు రద్దు కాగా, మరో 30కి పైగా రైళ్ల రాకపోకలపై మార్పులు చోటుచేసుకున్నాయి.
అక్వాన్ తుఫాను కారణంగా తూర్పు తీర రైల్వే (ECoR) పరిధిలో ఎక్కువగా రైళ్ల సర్వీసులు ప్రభావితమయ్యాయి. నవంబర్ 19 నుంచి 21 మధ్య నడవాల్సిన 41 నుంచి 47 రైళ్లను రద్దు చేయగా, మరో 28 నుంచి 29 రైళ్లను పునరుద్ధరించారు. పూరీ, భువనేశ్వర్, కటక్, బ్రహ్మపూర్ మీదుగా వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు వందే భారత్, ప్యాసింజర్, MEMU రైళ్లపైనా ఈ ప్రభావం పడింది.
ఆగ్నేయ రైల్వే (SER) కూడా తుఫాను ప్రభావంతో అప్రమత్తమైంది. కనీసం 28 ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. ముఖ్యంగా నవంబర్ 20న పూరీకి వెళ్లే, పూరీ మీదుగా ప్రయాణించే రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ మార్గాల్లో ప్రయాణించాల్సిన ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దక్షిణ తీర రైల్వే (SCoR) పరిధిలో 22 రైళ్లను రద్దు చేయగా, మరో 22 రైళ్లను పునరుద్ధరించారు. ఒక రైలును దారి మళ్లించారు. ముఖ్యంగా విశాఖపట్నం–కిరండూల్ ఎక్స్ ప్రెస్‌ను నవంబర్ 19, 20 తేదీల్లో రద్దు చేశారు. విశాఖపట్నం–కోరాపుట్ మధ్య నడిచే కొన్ని సర్వీసులు కూడా రద్దు జాబితాలో ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోనూ కొన్ని రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. చర్లపల్లి–షాలిమర్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18046), సికింద్రాబాద్–హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ వంటి ముఖ్యమైన రైళ్ల సర్వీసులను పునరుద్ధరించారు. దీంతో తెలంగాణ నుంచి తూర్పు తీర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కొంత ఊరట లభించింది.
తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ద్వారా రైలు కరెంట్ స్టేటస్ ను తెలుసుకోవాలి. IRCTC ద్వారా రైలు రద్దయిందా? దారి మళ్లించారా? అనే వివరాలను చూడవచ్చు. అటు రైల్వే హెల్ప్ లైన్ 139 ద్వారా రైళ్ల రద్దు, ప్రయాణ వివరాలు, రీఫండ్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రయాణికులు స్టేషన్‌కు బయలుదేరే ముందు తమ రైలు స్టేటస్ ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. . చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు.
Read Also: వందే భారత్ జర్నీ సోషల్ మీడియా స్టేటస్‌గా ఎందుకు మారుతోంది? సైకాలజీ చెప్పే క్రేజీ సంగతి ఇదే!