Dhanushkodi: ధనుష్కోడి… పేరు వింటేనే చాలా కొత్తగా అనిపిస్తుంది, కదా? తమిళనాడులోని పాంబన్ ద్వీపం చివరన ఉన్న ఈ చిన్న టౌన్ ఒకప్పుడు జనంతో సందడిగా ఉండేది. కానీ, 1964లో వచ్చిన భయంకరమైన తుఫాను ఈ ఊరిని శిథిలాల కుప్పగా మార్చేసింది. ఇప్పుడు ఇది ఒక గోస్ట్ టౌన్‌గా పెరొందింది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే అద్భుతమైన ప్రదేశం ఇది. శిథిలమైన గోడలు, నిశ్శబ్దంగా నిలిచిన సముద్రం, ఒంటరిగా కనిపించే బీచ్‌లు… ఇవన్నీ ధనుష్కోడిని సినిమా సెట్‌లా మార్చేశాయి. ప్రయాణికులకు ఇది ఒక మంచి అనుభవాన్ని ఇస్తుంది. అయితే, ఈ టూరిస్ట్ స్పాట్ గురించి తెలిసిన వారు చాలా తక్కువగా ఉంటారు. ఈ ప్లేస్‌కి ఎందుకు వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ధనుష్కోడి అంటే కేవలం బీచ్ లేదా టూరిస్ట్ స్పాట్ కాదు. అది ఒక కథ. ఒకప్పుడు రైల్వే స్టేషన్, చర్చి, జనం నడిచే రోడ్లతో ఉన్న ఈ ప్రాంతం, ఇప్పుడు శిథిలాల మధ్య చరిత్రను దాచుకుంది. ఇక్కడి బీచ్‌లు పచ్చని నీటితో, ఎటువంటి రద్దీ లేకుండా ప్రశాంతంగా ఉంటాయి. అంతేకాదు, రామాయణంలో చెప్పబడిన రామ సేతు (ఆడమ్స్ బ్రిడ్జ్) ఇక్కడే ఉందని నమ్ముతారు. ఈ ప్రదేశం పురాణాలు, చరిత్ర, ప్రకృతి అందాల కలయిక. సముద్రం రెండు వైపులా కనిపించే దృశ్యం మీ మనసును ఆకట్టుకుంటుంది.
ఏం చూడాలి?
ధనుష్కోడిలో చూడదగినవి చాలానే ఉన్నాయి. శిథిలమైన చర్చి, రైల్వే స్టేషన్, పాత పోస్టాఫీసు భవనాలు చరిత్రను తలపిస్తాయి. రామ సేతు వీక్షణ కేంద్రం నుంచి దూరంగా సముద్రంలో ఉన్న రాతి నిర్మాణాలను చూడొచ్చు. ఇక బీచ్‌లు అయితే, స్వచ్ఛమైన నీరు, మెత్తని ఇసుకతో మిమ్మల్ని ఆహ్వానిస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు ఇక్కడ అద్భుతంగా కనిపిస్తాయి. ఫొటోగ్రఫీ ఇష్టపడేవారికి ఇది స్వర్గం లాగా అనిపిస్తుంది!
తుఫాను వల్ల ధనుష్కోడి పట్టణం పూర్తిగా నాశనమైపోయింది. భారీ సముద్ర గట్టు, ఈదురుగాలులు పట్టణాన్ని ముంచెత్తి, రైల్వే లైన్, ఇళ్లు, చర్చిలు, గుడులు అన్నీ ధ్వంసమయ్యాయి. ఈ విపత్తులో చాలామంది చనిపోయారు, పట్టణం నివసించడానికి ఏమాత్రం పనికిరాని స్థితికి చేరింది.
గోస్ట్ టౌన్‌గా ఎందుకు మారింది?
తుఫాను తర్వాత ప్రభుత్వం ఈ ఊరిని మళ్లీ కట్టడం కష్టమని భావించి అలాగే వదిలేసింది. దాంతో ధనుష్కోడి ఖాళీగా మారిపోయింది. ఇప్పుడు అక్కడ కొందరు చేపలు పట్టే వాళ్లు మాత్రమే ఉంటారు. శిథిలమైన ఇళ్లు, రైల్వే ట్రాక్‌లు, నిర్మానుష్యమైన వాతావరణం వల్ల దీన్ని ‘గోస్ట్ టౌన్’ అని పిలుస్తారు.
ఎందుకు తక్కువ మందికి తెలుసు?
ధనుష్కోడి రిమోట్ లొకేషన్‌లో ఉంది. ఇక్కడ హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిస్ట్ సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి. రోడ్లు ఇసుకమయం కావడంతో సాధారణ కార్లలో వెళ్లడం కష్టం. అందుకే సామాన్య టూరిస్టుల కంటే, సాహస ప్రయాణికులు, చరిత్ర ఆసక్తి ఉన్నవారు ఇక్కడికి ఎక్కువగా వస్తారు. కొన్ని బ్లాగుల్లో, సోషల్ మీడియాలోనే కొందరు దీని గురించి చెప్తారు. అంతేకానీ, దీని గురించి పెద్దగా ప్రచారం జరగదు.
ఎలా చేరుకోవాలి?
ధనుష్కోడి చేరుకోవడానికి రామేశ్వరం నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇసుక రోడ్లు ఉండటం వల్ల జీప్ లేదా ఫోర్-వీల్ డ్రైవ్ వాహనాలు బెస్ట్. రామేశ్వరం దగ్గర్లోని రైల్వే స్టేషన్, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ధనుష్కోడి చేరొచ్చు. విమానంలో వెళ్తే, మధురై విమానాశ్రయం (170 కి.మీ) సమీపంలో ఉంది. అక్కడి నుంచి కారు లేదా బస్సులో రామేశ్వరం చేరి, అక్కడి నుంచి ధనుష్కోడి వెళ్లొచ్చు.
ఎప్పుడు వెళ్లాలి?
నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ధనుష్కోడి సందర్శనకు బెస్ట్ టైమ్. ఈ సమయంలో వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవిలో వేడి ఎక్కువగా ఉంటుంది, వర్షాకాలంలో రోడ్లు ఇబ్బందికరంగా మారతాయి.
ట్రావెల్ టిప్స్
ఇక్కడికి వెళ్లేవారు జీప్ బుక్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్థానిక డ్రైవర్లు ఊరి చరిత్రను కూడా చెప్తారు.
నీళ్లు, స్నాక్స్, సన్‌స్క్రీన్ తీసుకెళ్లాలి, ఎందుకంటే అక్కడ షాపులు దాదాపు ఉండవు.
ఉదయం లేదా సాయంత్రం వెళ్తే బీచ్ దృశ్యాలు మరింత అందంగా కనిపిస్తాయి.
ధనుష్కోడి అంటే కేవలం ప్రయాణం కాదు, ఒక అనుభూతి. రద్దీ నుంచి దూరంగా వెళ్లి కస్త ప్రైవసీ ఉంటే బాగుంటుంది అనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. అంతేకాకుండా పార్టనర్‌తో కలిసి సముద్ర అందాలను ఆస్వాదించాలనుకుంటే ధనుష్కోడి మంచి ఆప్షన్.