Train Mishap: అదొక జాయ్ ట్రైన్. ఎందరో చిన్నారులకు ఆ ట్రైన్ అంటే ఎంతో ఇష్టం. అలాగే ఈ చిన్నారికి కూడా ఆ ట్రైన్ అంటే అమిత ఇష్టం. కానీ సరదాగా ఆ ట్రైన్ లో తిరగాల్సిన చిన్నారి, దురదృష్టవశాత్తు అదే ట్రైన్ ఢీకొనడంతో కన్నుమూసింది. దీనితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుంటే, కన్నీళ్లు రావాల్సిందే.
గుజరాత్ వడోదరలోని కామతి పార్క్ ను సందర్శించేందుకు జంబుసర్‌కు చెందిన ఒక కుటుంబం వచ్చింది. ఈ పార్క్ ను సాయాజీ పార్క్ అని కూడా పిలుస్తారు. అసలే సమ్మర్ హాలిడేస్ కావడంతో వారు పిల్లలతో కలిసి అక్కడికి వచ్చారు. ఇక్కడ జాయ్ ట్రైన్ అంటే, చిన్న పిల్లలు ఎక్కి తిరిగే ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. అందుకే తమ పిల్లలను కూడా ఆ కుటుంబం పిక్నిక్ కు తీసుకువచ్చింది. శనివారం మధ్యాహ్నం, నాలుగేళ్ల బాలిక జాయ్, పార్క్ లో ఉన్న రైల్వే ట్రాక్‌ను దాటేందుకు ప్రయత్నించగా, ఆ సమయంలో రైలు ఆమెను ఢీకొట్టింది.
ప్రమాదం సమయంలో..
కామతి బాగ్ లో ముందు వీరు అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అక్కడ మొత్తం తిరుగుతూ ఆనందంగా ఉన్నారు. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యే సమయానికి ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. బాలిక రైలు ఆగే స్టేషన్ వద్ద సమీపంలోని ట్రాక్‌ను దాటడానికి ప్రయత్నిస్తుండగా, పక్క నుంచి వేగంగా వస్తున్న రైలు ఆమెను ఢీకొంది.
బాలిక అక్కడే కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని సాయాజీ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు అప్పటికే బాలిక చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనతో కుటుంబం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
రైలు డ్రైవర్ పరారీ..
సాయాజిగంజ్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరింత విచారణలో, రైలు డ్రైవర్ సంఘటన జరిగిన తరువాత పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.
Also Read: Govt Schemes: పెళ్లి తర్వాత ప్లాన్ ఉందా? ఈ స్కీమ్స్ మీకోసమే!
కామతి పార్క్ లో ఇలాంటి ప్రమాదం జరిగిన నేపథ్యంలో, ఆ ప్రాంతంలో ప్రయాణికులు, సందర్శకులు మరింత జాగ్రత్తగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి రైలు రూట్లపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అలాగే, సంబంధిత అధికారులు రైల్వే ట్రాక్ సమీపంలో మరింత గుర్తింపు, జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మొత్తం మీద పిక్నిక్ కోసం వచ్చిన ఆ కుటుంబం మాత్రం నాలుగేళ్ల చిన్నారిని కోల్పోవడంతో పార్కు లో విషాదఛాయలు అలుముకున్నాయి.