Diwali Train Booking 2026: దీపావళి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? పండుగకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రైళ్లలో టికెట్ల కోసం ఇప్పటి నుంచే డిమాండ్ పెరుగుతోంది. నవంబర్ 8న దీపావళి జరగనుండగా, ప్రయాణ తేదీని బట్టి ముందస్తు రిజర్వేషన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పండుగ సమయంలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్ సహా పలు రాష్ట్రాలకు వెళ్లే రైళ్లకు భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. అందుకే చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది.
భారతీయ రైల్వే ప్రస్తుత ముందస్తు రిజర్వేషన్ విధానం ప్రకారం, ప్రయాణ తేదీని మినహాయించి 60 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. సాధారణంగా బుకింగ్ విండో ఉదయం 8 గంటలకు ఓపెన్ అవుతుంది. అయితే, ప్రతి ప్రయాణ తేదీకి బుకింగ్ ప్రారంభమయ్యే రోజు ఒకేలా ఉండదు. మీరు ఎప్పుడు ప్రయాణించాలనుకుంటున్నారో దాని ఆధారంగా టికెట్ బుకింగ్ తేదీని ముందుగా చెక్ చేసుకోవాలి.
అంతేకాదు, దీపావళి సమయంలో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో కొన్ని ప్రధాన రూట్లలో టికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ–పాట్నా, ముంబై–పాట్నా, బెంగళూరు–పాట్నా, హైదరాబాద్–పాట్నా, చెన్నై–పాట్నా, వారణాసి–ఢిల్లీ, కాన్పూర్–ఢిల్లీ, ఢిల్లీ–గోరఖ్‌పూర్ లాంటి మార్గాల్లో ప్రయాణించే వారు ముందుగానే టికెట్ల లభ్యతను చెక్ చేసుకోవడం మంచిది.
పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ పండుగకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దీంతో సాధారణ రైళ్లలో టికెట్లు దొరకని ప్రయాణికులకు అనుకూలంగా ఉండనున్నాయి. వారణాసి–ఢిల్లీ, అయోధ్య కంటోన్మెంట్–ఆనంద్ విహార్, చండీగఢ్–పాట్నా, ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్–పాట్నా, ఆనంద్ విహార్–పాట్లీపుత్ర వంటి మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి.
04209/04210 వారణాసి–ఢిల్లీ–వారణాసి ఫెస్టివల్ స్పెషల్ రైలు 50 ట్రిప్పులు నడవనుంది. వారణాసి నుంచి రాత్రి 10:15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:45 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీ నుంచి సాయంత్రం 6:50 గంటలకు బయలుదేరి ఉదయం 9:50 గంటలకు వారణాసి చేరుతుంది. ఈ రైలులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయి.
అయోధ్య కంటోన్మెంట్–ఆనంద్ విహార్ ప్రత్యేక రైలు 36 ట్రిప్పులు, చండీగఢ్–పాట్నా ప్రత్యేక రైలు 18 ట్రిప్పులు, ఫిరోజ్‌పూర్–పాట్నా ప్రత్యేక రైలు 16 ట్రిప్పులు నడవనున్నాయి. ఆనంద్ విహార్–లౌకాహా బజార్, న్యూఢిల్లీ–కాన్పూర్, ఆనంద్ విహార్–కాన్పూర్, ఆనంద్ విహార్–పాట్లీపుత్ర వంటి మరికొన్ని రూట్లలో కూడా అదనపు సర్వీసులను ప్రకటించారు.
దీపావళి ప్రయాణం కోసం ముందుగానే డేట్ ఫిక్స్ చేసుకుని, ఆ తేదీకి టికెట్ బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెక్ చేసుకోవాలి. బుకింగ్ సమయంలో రైలు నంబర్, ప్రయాణ తేదీ, ఎక్కే స్టేషన్, గమ్యస్థానాన్ని ఒకసారి సరిచూసుకోవడం మంచిది. ముందస్తు ప్లానింగ్.. ముందస్తు బుకింగ్ తో దీపావళి ప్రయాణాన్ని ఈజీగా మార్చుకోవచ్చు.
Southern Railway's Diwali bookings are opening soon!🚂
Reserve your train tickets starting September 6th.
Plan ahead to avoid the holiday rush and secure your seats early! 🪔#SouthernRailway #Diwali2026 #Travel #IndianRailways #Train pic.twitter.com/dzuOWBnZby
— Southern Railway (@GMSRailway) September 4, 2026
Read Also: ప్రకృతి అందాల నడుమ రైలు ప్రయాణం.. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన జర్నీస్ ఇవే!