Vande Bharat Impresses Foreign Traveller: వందే భారత్ రైళ్లు దేశీయ ప్రయాణికులనే కాదు, విదేశీ పర్యాటకులను కూడా అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ విదేశీ మహిళ వందే భారత్ రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అద్భుతమైన ప్రయాణం అంటూ ప్రశంసించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రైలులోని సౌకర్యాలను ప్రశంసిస్తూ ఆమె చెప్పిన విషయాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఆండ్రియా పాస్పర్ అనే స్పానిష్ ట్రావెల్ వ్లాగర్ వందేభారత్ ప్రయాణానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భారత్ లోని పలు ప్రాంతాలను సందర్శిస్తూ తన అనుభవాలను వీడియోల రూపంలో షేర్ చేసింది. అందులో భాగంగా వందే భారత్ రైలులో ప్రయాణించింది. అయితే, ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ఈ వీడియోలో ఆమె వందే భారత్ చైర్ కార్ కోచ్ ను చూపిస్తూ, అందులోని సౌకర్యాలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కోచ్ లోని విశాలమైన సీట్లు, లగేజీ కోసం ఏర్పాటు చేసిన ఓవర్ హెడ్ స్టోరేజ్, ప్రయాణికులకు అందుబాటులో ఉన్న ట్రే టేబుల్, మొబైల్ ఛార్జింగ్ కోసం ప్లగ్ పాయింట్లు, వాటర్ బాటిల్ హోల్డర్లు లాంటి అంశాలను ఆమె వివరంగా చూపించింది. ఈ సౌకర్యాలు తనకు ఎంతో నచ్చాయని పేర్కొంది.
ప్రయాణ సమయంలో అందించిన స్నాక్స్ కూడా ఆండ్రియాను ఆకట్టుకున్నాయి. క్యారమెలైజ్డ్ పాప్ కార్న్, మ్యాంగో జ్యూస్, డైట్ మిక్చర్, కచోరీ, కాఫీ ప్రీమిక్స్ లాంటి పదార్థాలతో కూడిన స్నాక్ ట్రేను వీడియోలో చూపించింది. వాటి రుచి తనకు ఎంతో బాగా నచ్చిందని చెప్పింది. తర్వాత అందించిన భోజనాన్ని కూడా ఆమె వీడియోలో చూపించింది. పప్పు, కూర, చపాతీ, అన్నం లాంటి వంటకాలతో కూడిన భోజనాన్ని ఆస్వాదించింది. భోజనం రుచిగా ఉందని, కడుపు నిండుగా తిన్నానని తెలిపింది. చివరగా అందించిన ఐస్ క్రీమ్ తో తన భోజనాన్ని ముగించింది.
అంతేకాకుండా, రైలులోని పరిశుభ్రతను కూడా ఆమె ప్రశంసించింది. ముఖ్యంగా వాష్ రూమ్ ను చూసిన తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వాష్ రూమ్ పరిమాణం, పరిశుభ్రత, అందులో ఉన్న సౌకర్యాలు తాను ఊహించిన దానికంటే బాగున్నాయని చెప్పుకొచ్చింది. వాష్ రూమ్ మెయింటెనెన్స్ కు 10కి 10 మార్కులు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో రియాక్ట్ అయ్యారు. భారతీయ రైల్వే సేవలను నిజాయితీగా చూపించినందుకు ఆమెను పలువురు అభినందించారు. సాధారణంగా కొంతమంది విదేశీ కంటెంట్ క్రియేటర్లు భారత్ లోని నెగెటివ్ అంశాలపైనే ఎక్కువ దృష్టి పెడతారని, కానీ, ఈ వీడియోలో మంచి విషయాలను చూపించడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇంకొందరు వందే భారత్ రైళ్లు యూరప్ లోని కొన్ని రైళ్ల కంటే చాలా బాగున్నాయని చెప్పుకొచ్చారు.
Read Also: అంతరిక్షం నుంచే బుల్లెట్ రైళ్ల కంట్రోల్.. చైనా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!